జగన్ చేష్టలు రాష్ట్రానికి శనిలా దాపురించాయి : డీ.బీ.వీ.స్వామి

ప్రజలు అనుభవిస్తున్న అష్టదరిద్రానికి, అష్టకష్టాలకు జగన్మోహన్ రెడ్డే కారణమని టీడీపీ ఎమ్మెల్యే డోలా.బాల వీరాంజనేయస్వామి అన్నారు. జగన్మోహన్ రెడ్డే  ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద అష్టదరిద్రమని మండిపడ్డారు. జగన్ చర్యలు, చేతలు, నిర్ణయాలు అన్నీ ప్రజలకు, రాష్ట్రానికి శనిలా దాపురించాయని విమర్శించారు. నవ గ్రహాలు చూపలేని ప్రభావాన్ని ఈ ముఖ్యమంత్రి నవరత్నాలతో చూపుతూ, ప్రజల నవరంధ్రాల్లోంచి రక్తం కారేలా చేస్తున్నాడని తెలిపారు. మూడేళ్ల పాటు నిద్రలో జోగిన ముఖ్యమంత్రి, ఇప్పుడు బయటకు వచ్చి, ప్రతిపక్షాలు,  మీడియాను దుష్టచతుష్టయం అనడం సిగ్గుచేటన్నారు.

ఏపీలో నీళ్లులేవు..కరెంట్ కోతలు, రోడ్లు అధ్వాన్నం అంటున్న కేటీఆర్, హరీశ్ రావుల వ్యాఖ్యలకు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మొన్నటి వరకు కేసీఆర్ ను పొగిడిన జగన్, ఇప్పుడు ఆయన్ని, కేటీఆర్ నికూడా దుష్టులు, దుర్మార్గులనే అంటాడా అని నిలదీశారు. పాలన చేతగాని ముఖ్యమంత్రి, తన అసమర్థత ప్రజలకు తెలియకూడదనే ప్రతిపక్షాలపై, మీడియాపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేఎన్నికల్లో తన పార్టీకి 30 స్థానాలు కూడా రావన్న చేదు నిజాన్నిజీర్ణించుకోలేకనే ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలపై పడి ఏడుస్తున్నాడని విమర్శించారు.

నవ గ్రహాల బాధల నుంచి ముక్తి పొందడానికి సాధారణంగా పూజలు చేస్తుంటారు….అలానే ఈ ముఖ్యమంత్రి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురుచూస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి నాశనం, పరిశ్రమలు, కంపెనీలు తరిమేయడం, 7లక్షలకోట్ల అప్పులు, విద్య, వైద్యరంగాలను నాశనం చేయడం..ఆడబిడ్డలపై అఘాయిత్యాలు… మూడేళ్లలో ఈ ముఖ్యమంత్రి సాధించిన ఘనతలుగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *