దళితులపై జగన్ ది కపటప్రేమ : నక్కా ఆనందబాబు

జగన్ దళిత వర్గాలపై కపటప్రేమ వలకబోస్తున్నారని, అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లెలో చేసిన పర్యటనలో జగన్ అబద్దాలు ప్రచారం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ కు ఓట్లేసి మోసపోయిన మొట్టమొదటి వర్గం దళితవర్గమే.  చంపడానికి కూడా మాకు హక్కు కల్పించారనేట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.  చంపి డోర్ డెలివరి చేస్తున్నారు. ఎమ్మెల్సీ  అనంతబాబు తన డ్రైవర్ ని చంపి.. 48 గంటలు డ్రామా నడిపిన విషయం అందరికీ తెలిసిందే.  ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో రాచమర్యాదలు చేస్తూ.. శాసనసభ్యురాలిచే బయట పాలాభిషేకం చేయడం సిగ్గుచేటు.

జిల్లాలో కులాలవారీగా విభజించి కులచిచ్చు పెడుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబును తప్పించడానికి ప్రయత్నం చేసి కుదరని పక్షంలో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతబాబును కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తుంది. అనంతబాబు తప్పు చేయలేదు గనుకనే దర్జాగా ప్రజల్లో తిరుగుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ నిస్సిగ్గుగా సమర్ధించాడు. దళిత సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ధర్నాలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేశారు. అంటే జగన్ రెడ్డి పార్టీ నుంచి అనంతబాబును సస్సెండ్ చేసింది కేవలం దళిత వర్గాలను శాంతింపచేయడానికే అని స్పష్టంగా అర్ధమౌతుంది.

పరోక్షంగా అనంతబాబును బయటికి తీసుకురావడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోంది. అనంతబాబుకు జైల్లో అన్ని రాచమర్యాదలు జరుగుతున్నాయి. ప్రత్యేక రూం, బెడ్, పుడ్ ఏర్పాట్లు చేశారు. 14 రోజుల రిమాండ్ లో జైల్లో మరో ఖైదీపై అనంతబాబు దాడి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్ రెడ్డి కనుసన్నల్లో వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు. హంతకులకు జగన్ రెడ్డి అండగా నిలబడుతూ…..దళితులకు వెన్నుపోటు పొడుస్తున్నాడు.  సంక్షేమం, సమన్యాయం, ఆర్థిక స్వావలంబన అంటూ మోసపూరిత మాటలు చెబుతూ.. దళిత, గిరిజన, బహుజనులను నిలువు దోపిడీ చేస్తున్న జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *