ఆయనతో సమానంగా కడప జిల్లా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు- జగన్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. ఆయన కుమారుడిగా తనను కడప ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కడప జిల్లాలో వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా పర్యటించిన ఆయన.. ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ. 515 కోట్లతో మొత్తం 8 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రొద్దుటూరులో 30 నెలల్లో ప్రజలకు 320 కోట్లు బదిలీ చేశామని అన్నారు. సుమారు 22,212 మంది అక్కా చెల్లెల్లకు ఇళ్ల స్థలాల కోసం 200 కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.
వీటితో పాటు 515 కోట్లతో ప్రొద్దుటూరులో అభివృద్ది పనులకు శంకుస్థాపనతో పాటు, పట్టణంలోని మైనారిటీలకు ఉర్దూ డిగ్రీ కళాశాల, ఎల్లా ఆంజనేయ స్వామి ఆలయ ఆధునీకరణకు నిధులు మజూరు చేసినట్లు జగన్ సభాముఖంగా తెలియజేశారు. మరోవైపు ఇటీవలే సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు జగన్.
గత నెలలో మునుపెన్నడు లేని విధంగా రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేసిపడేశాయి. కడప జిల్లాలోనూ విపరీతమైన వర్షాల కారణంగా చాలా పంటనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అనేక మంది నివసించేందుకు కూడా చోటు లేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ క్రమంలోనే వారికి అండగా ఉటానని జగన్ హామీ ఇచ్చారు.