గజదొంగలు సైతం ఆశ్చర్యపోయేలా జగన్ దోపిడీ :  చంద్రబాబు

రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి వ్యక్తిగత అజెండాతో సర్వనాశం చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణస్వీకార సభలో జగన్ రెడ్డి ప్రకటించి అందుకు విరుద్ధంగా, అసాధారణంగా మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని అన్నారు. గురువారం నాడు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు జూమ్ లో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యుత్ రేట్లు చూసి పరిశ్రమలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. పరిశ్రమలు లేకపోతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.

కరోనా కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇసుక, సిమెంట్, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి  ప్రజలు ఆర్థికంగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలను మరోసారి పెంచి ప్రజలపై పెనుభారం మోపడాన్ని నేతలు ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. విద్యుత్ చార్జీలు పెంచుతూ, పన్నులు వేస్తూ జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చార్జీలు పెంచేది లేదని సగర్వంగా ప్రకటించిందని, పైగా పది వేల మెగావాట్ల అధనపు విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవడం ద్వారా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిందన్నారు. వ్యవసాయ మోటార్లకు 9 గంటల పాటు కోతలు లేకుండా కరెంట్ ఇచ్చింది. 2014, నవంబర్ 30 నాటికి రాష్ట్రంలో 14.81 లక్షలు ఉన్న వ్యవసాయ కనెక్షన్లను 2019, మార్చి 31 నాటికి 18.07 లక్షల కనెక్షన్లకు పెంచడం జరిగింది. టీడీపీ 5 ఏళ్ల పాలనలో 3.26 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షలు ఇవ్వడం జరిగిందని, సరాసరి ఏడాదికి 65,200 కనెక్షన్లు ఇచ్చామన్నారు.

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *