నేను లేకపోతే గౌతంరెడ్డి రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో..! : సీఎం జగన్

రాజకీయాల్లోకి గౌతంరెడ్డిని నేనే తీసుకువచ్చానని, రా గౌతమ్‌ అని చెప్పి తనను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి… నేను అడుగులు వేస్తేనే తాను అడుగులు వేశాడని సీఎం భావద్వేగానికి గురయ్యారు. నెల్లూరులో సోమవారం గౌతంరెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొన్నారు. గౌతమ్ మంచి రాజకీయనాయకుడిగా కూడా తాను ఎదిగాడని, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి… మంత్రిపదవి చేపట్టారన్నారు. పరిశ్రమలు, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు దాదాపు ఆరు శాఖలు  నిర్వహించాడన్నారు. ప్రతి సందర్భంలోనూ పరిశ్రమలు ఇక్కడికి తీసుకుని రావాలి… ఇక్కడికి తీసుకుని వస్తే… రాష్ట్ర ప్రభుత్వానికి, నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుందని ఎప్పుడూ తాపత్రయపడేవాడని గుర్తు చేశారు.

చివరి క్షణాల్లో దుబాయ్‌ వెళ్లేముందు తనకు కనిపించాడన్నారు. దుబాయ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల మీద తనను కలవాలని టైం కూడా అడిగాడని, అంతలోపే ఈ సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సందర్భంలోనూ ఒక మంచి మంత్రిగా, మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి స్నేహితుడిగా అన్నిరకాలుగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని, జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదని, గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు.

ఇంకా కనిపిస్తూనే ఉంటాడు… రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉందని, తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందన్నారు. తనకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉందని, మంచి స్నేహితుడని, అన్నారు. నేను లేకపోయి ఉండుంటే.. గౌతమ్‌ బహుశా రాజకీయాల్లోకి కూడా వచ్చి ఉండేవాడు కాదేమోనన్నారు.  తన కన్నా గౌతమ్‌ వయస్సులో సంవత్సరం పెద్ద అని, అయినా ఎక్కడా కూడా తాను నాకన్నా పెద్ద అన్న భావం మనస్సులో ఉండేది కాదన్నారు. నన్నే ఒక అన్నగా భావించేవాడని, తాను నువ్వు చేయగలుగుతావు… మేమంతా ఉన్నాం అని నన్ను ప్రోత్సహించేవాడన్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *