ఏపీ టికెట్ల లొల్లి ఎక్కడ చెడింది.. నిజంగానే జగన్ ప్రభుత్వాన్ని సినీ ఇండస్ట్రీ మరిచిపోయిందా.. అందుకే కక్ష్య తీర్చుకుంటున్నారా..?

Jagan: ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా రచ్చ జరుగుతున్న అంశం థియేటర్ల టికెట్ రేట్ల వ్యవహారం. టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య చిన్నపాటి యుద్దమే చెలరేగుతోంది. టాలీవుడ్ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాన్ రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో పాల్గొన్న సమయంలో టికెట్ రేట్లపై చాలా ఆగ్రహం వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల నాచురల్ స్టార్ నాని కూడా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. ఏపీలో థియేటర్ల కలెక్షన్లు పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా వస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని కూడా అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఏపీలో టికెట్ల ధరలపై ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇటీవల ఆర్జీవీ.. మంత్రి పేర్ని నానితో కూడా సమావేశం అయ్యారు. అయితే సమస్య ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఓ వాదన.. సినీ పరిశ్రమ, థియేటర్ యజమానులు మరో వాదన వినిపిస్తున్నాయి. సామాన్య ప్రేక్షకుడికి సినిమాను చేరువ చేయాలనే ఉద్దేశ్యంలోనే ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించిందని చెబుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 35 సినీ ఇండస్ట్రీని దెబ్బతీసేలా ఉందనేది టాలీవుడ్ వాదన. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ రేట్లు ఉంటే ఎలా అని సిని పరిశ్రమ ప్రశ్నిస్తోంది. మరో వైపు థియేటర్ యజమానులు కూడా టికెట్ రేట్లపై పెదవి విరుస్తున్నారు. ఐదు రూపాయలకు కనీసం టీ కూడా రాని ఈ రోజుల్లో అతి తక్కువగా రూ. 5 టికెట్ ధర పెట్టడం ఏంటని థియేటర్ నిర్వాహకులు వాపోతున్నారు. థియేటర్లను గ్రామాలు, పట్టణాలుగా చూడకుండా…

Jagan
Jagan

వాటిలో ఉండే సౌకర్యాలను బట్టి రేట్లు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా మల్టీపెక్స్ సౌకర్యాలను కల్పించాం అని అలాంటప్పడు టికెట్ ధరలు తగ్గిస్తే కనీసం మెంటనెన్స్ డబ్బులు కూడా రావని థియేటర్ యజమానుల వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే దీంట్లో రాజకీయ కోణం కూడా ఉందనేది కొందరి వాదన. జగన్ సీఎం అయిన తర్వాత సినీ ప్రముఖులు పెద్దగా పట్టించుకోలేదని.. అందుకే జగన్ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వాదించే వారు కూడా ఉన్నారు. ఇటీవల ఓ వైసీపీ నాయకుడు ఇదే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఓ ప్రభుత్వం ఉందని.. ఇక్కడో సీఎం ఉన్నాడని సినిమా ఇండస్ట్రీ గుర్తించడం లేదని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను చూస్తే ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ కు ఎక్కడో చెడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.  సినీ పెద్దలంతా టీడీపీకి కొమ్ము కాసేవారని విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా ఈ విమర్శలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా స్పందించాడు. ఈ వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని.. ఆయన అన్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది నాపై సినిమాలు తీశారని వ్యాఖ్యానించాడు.  ప్రస్తుతం టికెట్ ధరలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం నిర్ణయిస్తుందో చూడాలి. ఈ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుందనేది అందిరిలోనూ ఆసక్తి క్రియేట్ చేస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *