బంగారు నాణేలు పంచినా అక్కడ గెలిచేది వైసీపీనే: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ హయాంలో చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడి జరిగినా ఈనాడు రామోజీకి కనిపించలేదా అని మంత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు బంగారు నాణేలు పంచిపెట్టినా గెలిచేది వైసీపీనే అని స్పష్టం చేశారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది, పారదర్శకమైన ఇసుక విధానం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రులతో కమిటీ వేసి, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నూతన ఇసుక విధానం తీసుకువచ్చారన్ననారు. ‘‘ఇసుక విధానంపై పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత అనేక మార్పులు, చేర్పులు చేశాం. ఇందులో భాగంగానే ప్రభుత్వం మంజూరు చేసిన  గృహ నిర్మాణాలకు, ఎడ్ల బండ్ల మీద ఇసుక తీసుకువెళ్ళే వారికి ఉచితంగా తీసుకువెళ్ళేందుకు వెసులుబాటు కల్పించాం.

టెండర్ల విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చాం.  చెన్నై సంస్థ గుప్పిట్లో ఇసుక.. అంటూ అసత్యాలతో కూడిన కథనాన్ని వండివార్చుతున్నారని, ఇసుకా లేక ఈనాడుకు మసకా అన్నది ప్రజలకు అర్థమయ్యేందుకు నాలుగైదు అంశాలు ప్రజల ముందుకు తీసుకువచ్చామన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ఇసుక వేలం నిర్వహించినది ఏపీ ప్రభుత్వం కాదని, దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ ఎండీసీ ద్వారా వేలం వేయించామని తెలిపారు.

పాల్గొనదలచుకున్న వారు ఎవరైనా టెండర్లలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని వారికి అప్పగించి, దానికి రూ.120 కోట్లు డిపాజిట్ చేసిన ఎవరైనా టెండర్ వేయవచ్చని చెప్పామని గుర్తు చేశారు. ఇందులో ఈనాడు రామోజీరావు పాల్గొనవచ్చు, చంద్రబాబు కూడా పాల్గొనవచ్చు, లేదా వారి బినామీలతో టెండర్లు వేయించి ఉండవచ్చని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ.. సబ్ కాంట్రాక్టులు ఇవ్వటం అన్నది అసాధారణం కాదని ఈనాడు రామోజీకి, చంద్రబాబుకు  బాగా తెలుసని, వారి బంధువులు కూడా ఈ కాంట్రాక్టు పనులు చేస్తున్నారు కదా అని అన్నారు. చంద్రబాబు హయాంలో రూ.3,750 కోట్లు ఇసుక ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళిందని ప్రశ్నించారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *