మీ గుండె పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి..!
పని చేసినంతవరకూ గుండె గురించి పెద్దగా పట్టించుకోం కానీ ఎప్పుడైనా మొరాయిస్తే ‘ముందే జాగ్రత్త పడితే బాగుండేది కదా’ అని చింతిస్తాం. ఒకప్పుడు అరవైఏళ్లు దాటితేనే గుండె పోటు వస్తుందనే నమ్మకం ఉండేది, ఇప్పుడు వయసుతో సంబంధం లేదు గుండె జబ్బులు ఎప్పుడైనా దాడి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధులు, హైబీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్లలో గుండె పోటు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉంది. అందుకే గుండె కోసం ప్రత్యేకంగా సంరక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అరటిపండు, కొబ్బరి నీళ్లను వీలైనంత తరచుగా తినాలి. వీటిల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తసరఫరాను మెరుగుపరిచేందుకు పొటాషియం చాలా అవసరం. బీపీని నియంత్రించడంలో కూడా ఇది కీలకం. కాబట్టి గుండె పోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. బఠానీలు, గుమ్మడికాయ, బంగాళదుంపలు, నారింజ, దోసకాయ, పుట్టగొడుగులు, వంకాయ ఎండుద్రాక్షలను తినడం ద్వారా గుండెజబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
గుండెను ఉక్కులా మార్చేందుకు రోజు వారీ ఆహారంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, తృణ ధాన్యాలను భాగం చేసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పెరుగు.. ముఖ్యంగా వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు గుండెకు అండగా నిలుస్తుంది. ఇందులో గుండెపోటును అదుపులో ఉంచే పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఖనిజ లవణాలెన్నో. కాబట్టి భోజనంలో పెరుగు, మజ్జిగను చేర్చుకోవటం మంచిది. ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, బాదం పప్పులు, అవిసె గింజల్లాంటివి తరచూ తినాలి. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండే చిలగడదుంపలను తినడం మీ గుండెకు మంచిది.