థ్యాంక్స్ చెప్తే రాజీనామా అని ప్రచారం చేశారు : మాజీ హోంమంత్రి సుచరిత
హోంమంత్రిగా తనకు మూడేళ్లు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ లేఖ రాస్తే దాన్ని రాజీనామా లేఖగా ప్రచారం చేశారని మాజీమంత్రి సుచరిత స్పష్టం చేశారు. తాను రాజీనామా చేసింది అవాస్తమన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాట అవాస్తవమని, పార్టీలో నాకు వీసమెత్తు అవమానం కూడ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.
కేబినెట్లో కొంతమందిని మారుస్తామని సీఎం ముందే చెప్పారని, సీఎం జగన్ కుటుంబంలోని ఒక మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని, కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
అయితే రెండు రోజుల క్రితం..గత కేబినెట్ లో పని చేసిన ఎస్సీలందరికీ తిరిగి మంత్రి పదవులు ఇచ్చి..తనకు ఇవ్వకపోవటంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. సుచరిత. ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్వయంగా సుచరిత ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వినుకోలేదు. మోపిదేవి వెంకటరమణకు రాజీనామా లేఖ ఇచ్చినట్లు సుచరిత కూతురు వెల్లడించారు. కానీ ఆ లేఖ థ్యాంక్స్ చెప్తూ రాసిందని, రాజీనామా చేయడం లేదని సుచరిత తెలిపారు. ఇదే బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. కాపు రామచంద్రారెడ్డి, పార్థసారధితో కూడా జగన్ మాట్లాడి సర్థి చెప్పారు.