సాంప్రదాయాలు పాటించే ఆత్మకూరు ఉప పోరుకు దూరం : చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలతో పోలవరం ప్రాజెక్టును బలి చేసిందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్ల విధానంపై గొప్పగా చెప్పిందని…చివరికి ఆ విధానం వల్ల ప్రాజెక్ట్ రివర్స్ అయ్యిందని విమర్శించారు. పనులు చేస్తున్న ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం చెప్పిన సూచనలను రాష్ట్రం పాటించకపోవడం వల్లనే అనర్థం జరిగిందని చంద్రబాబు అన్నారు. 2020లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం…2022 వచ్చినా ప్రాజెక్టు ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమని నేడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.

టిడిపి మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై రివ్యూ చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు మండి పడ్డారు. చట్ట సభ సభ్యుడు చనిపోతే….వాళ్ల కుటుంబ సభ్యులకే తిరిగి ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదు అనే విధానం టిడిపి పాటిస్తుందని అన్నారు. ఈ విధానం తోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టిడిపి పోటీ పెట్ట లేదని అన్నారు.

మొదటి నుంచి టిడిపి ఈ విధానాన్ని అనుసరిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే దీని పైనా వైసిపి నీచంగా రాజకీయ విమర్శలు, సవాళ్లు చెయ్యడానికి చంద్రబాబు తప్పుపట్టారు. సంస్కారం లేకుండా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారని  మండిపడ్డారు. బద్వేల్ లో ఎందుకు పోటీ పెట్టలేదో…ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు పాటించాలి అని చంద్రబాబు అన్నారు. జగన్ పాలన చెయ్యలేకపోతున్నారని…..ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుందని చంద్రబాబు అన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *