కరోనా వల్ల ఏపీకి ఆదాయం తగ్గలేదు : ఎమ్మెల్సీ అశోక్ బాబు

కరోనాతో చాలారాష్ట్రాలు తీవ్రంగా ఆదాయంకోల్పోయినా, ఏపీప్రభుత్వానికి మాత్రం ఆదాయం తగ్గలేదని, జీఎస్టీచెల్లింపలు, ఇతరత్రా మార్గాల్లో ఆదాయం మూడేళ్లలో బాగానే పెరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. ‘‘కరోనాను బూచిగా చూపుతూ, ఆదాయం తగ్గిందన్న ప్రభుత్వ వ్యాఖ్యలు అబద్ధాలు. చాలారాష్ట్రాలకు ఆదాయం తగ్గినాకూడా అవేవీ ప్రజలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలుగానీ, ఉద్యోగుల జీతభత్యాలు గానీ ఆపలేదు.  2020-21, 2021-22లో జీఎస్టీ ఆదాయం, వ్యాట్ ఆదాయం ప్రభుత్వానికి విపరీతంగా పెరిగింది. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా పెరిగాయి.

కానీ ఏపీ ప్రభుత్వం మాత్రమే కరోనాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం అప్పులు చేస్తూ, ఆసొమ్మంతా ఏం చేస్తుందో చెప్పకుండా అటు ప్రజలతో, ఇటు ఉద్యోగులతో ఇప్పటికీ ఆడుకుంటోంది. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఠంఛన్ గా ఒకటోతేదీనే జీతాలు అందించాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయన తన ఐదేళ్లపాలన దాన్ని కచ్చితంగా తూచాతప్పకుండా అమలుచేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఔట్ సోర్సింగ్ వారైనా, రెగ్యులర్ వారైనా వారి కమిట్ మెంట్స్ వారికి ఉంటాయి. నెలనెలా చెల్లించాల్సిన వివిధరకాల ఈఎమ్ఐలు ఆలస్యమైతే, ఈప్రభుత్వం చెల్లిస్తుందా?

బ్యాంకువారు ఈఎమ్ఐలను కచ్చితంగా ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాలనుంచి మినహాయించుకుంటారు. 96,898 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుంటే, వారిలో  76వేల మందికి ఏప్రియల్ నెల జీతాలను ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆఖరికి ఏప్రియల్ 30వ తేదీనాటికి 61వేలమందికే జీతాలు ఇచ్చింది. వీటన్నింటిగురించి తాముమాట్లాడితే ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్లో ఇబ్బందులున్నాయని తప్పించుకుంటోంది. సీఎఫ్ఎంఎస్లో ఇబ్బందులుంటే, మార్చి నెలకు సంబంధించి ఉద్యోగుల తాలూకా రూ.13వేల కోట్ల బిల్లులను ఎందుకు  జగన్ ప్రభుత్వం రిటర్న్ చేసిందో చెప్పాలి?’’ అని డిమాండ్ చేశారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *