ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు వైకాపా ఎత్తుగడలు-బీజేపీ నేత
విజయనగరం రామతీర్థం ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమలో జరిగిన గందరగోళం గురించి అందరికీ తెలిసిందే. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా. దీనిపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఈ ఘటనపై బీజెపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. అందుకు వైసీపీ, టీడీపీ పార్టీలు బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటివరకు జరిగిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తోందని అన్నారు. హిందూ ధార్మిక ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల అంశంపై మాట్లాడిన ఆయన.. వైసీపీ అనవసరంగా ఈ విషయాన్ని వివాదం చేస్తోందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు సంక్రాంతి సమయంలో ఎక్కడెక్కడ నుంచో ప్రజలు ఇళ్లకు తిరిగొస్తుంటారని.. అటువంంటి సమయంలో బస్సు టికెట్లతో పాటు, ఆలయాల్లో దర్శన టికెట్లను ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం పని తీరులో వైఫల్యాలు కనిపిస్తున్నాయని.. వాటిని కప్పిపుచ్చేందుకే లేని సమస్యలను వైకాపా ప్రభుత్వం సృష్టిస్తోందని అన్నారు. గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్లపై అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. అవిలేవు ఇవి లేవని వంకలతో వాటి లైసెన్సులు రద్దు చేసి.. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు సినిమా టికెట్ల ధరలపైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది.