సినిమా చూడాలంటూ హాఫ్ డే లీఫ్ ప్రకటించిన అస్సాం ప్రభుత్వం..!
The Kashmir Files సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. 1980-90లలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ విధానాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెండితెరపై చూపించారు. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ప్రధాని మోడీ స్వయంగా సినిమాపై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు.
ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదపు పన్నును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అస్సాం ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై అందరి దృష్టిని ఆకర్షించింది. అస్సాం ప్రభుత్వం The Kashmir Files సినిమా కోసం రాష్ట్రవ్యాప్తంగా హాఫ్ డే లీవ్ ప్రకటించింది. సినిమాను చూడమంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధంగా ప్రభుత్వమే స్వయంగా సెలవును ప్రకటించడం గమనార్హం. మరోవైపు మంగళవారం బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ సినిమాను చూడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, నేతలకు సూచించారు.
కాగా సోమవారం కర్ణాటక శాసనసభ్యుల కోసం సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ కగేరి కోరడం తెలిసిందే.ఇక సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమాకి క్రేజ్ పెరగడంతో తొలి రోజు 600 స్క్రీన్లలో విడుదలైన ది కాశ్మీరీ ఫైల్స్.. ఇప్పుడు ఏకంగా 2000 స్క్రీన్లలో ప్రదర్శించబడుతోంది. మొత్తానికి సైలెంట్ గా వచ్చి ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ సునామీని సృష్టిస్తోంది The Kashmir Files.