ఏం చర్యలు తీసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలి : కళా వెంకట్రావు

రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయని, జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు విమర్శించారు. రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదని, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి, సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకోవడానికి నిధులు ఉంటున్నాయికానీ, రాజధాని నిర్మాణానికి మాత్రం ఉండటం లేదా అని ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రాజధాని నిర్మాణంపై ఈ ముఖ్యమంత్రి దృష్టి పెట్టలేదు. విధ్వంసం చేసేందుకు అడ్డమైన ఆరోపణలన్నీ చేశారు.

చంద్రబాబు నాయుడు రూపొందించి మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఉండుంటే రాజధానితో పాటు, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కూడా అమరావతి నుండి సమకూరేవి. అన్ని ప్రాంతాలకు సమదూరంగా జిల్లాల పునర్విభజన చేశామని చెప్తున్న ప్రభుత్వం మరి రాజధాని విషయంలో సమదూరం సిద్ధాంతం గుర్తుకు రాలేదా.? కొద్దిపాటి నిధులను వెచ్చిస్తే  78 పూర్తి చేసిన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, 69 శాతం పూర్తి అయిన ఐఎఎస్, 72 శాతం పూర్తైన గెజిటెడ్ అధికారలు నివాసాలు పూర్తయ్యేవి.

రాజధానిపై ఈ ప్రభుత్వానికి దురుద్దేశం లేకుంటే ఆపేసిన నిర్మాణాలు ఎందుకు ప్రారంభించడం లేదు.? రాజధానిలో ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు అప్పగించాల్సిన బాధ్యతను జగన్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు రాజధాని ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నా అని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి అదే రాజధాని ప్రాంతంలో టీడీపీ హయాంలో నిర్మించిన 5,028 ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వట్లేదు.? తాము ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని సిగ్గులేకుండా సభల్లో అబద్ధాలు చెప్తున్నారు. న్యాయస్థానం తీర్పు తర్వాత రాజధాని అభివృద్ధికి ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *