వచ్చే ఎన్నికల్లో అక్కడి నుండే పవన్ పోటీ..?
గత సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఆ దెబ్బ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సారి తమకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంచుకునే పనిలో పవన్ ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి రెండు చోట్లా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇది జనసైనికులక మింగుడు పడలేదు. ఆ షాక్ నుండి చాలా రోజుల వరకు జనసేన శ్రేణులు కోలుకోలేదు కూడా. అయితే ఇప్పుడు మాత్రం చాలా పగడ్బందీగా విజయాన్ని వరించిపెట్టే నియోజకవర్గం వైపు పవన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే పవన్ తిరుపతిని ఎంచుకున్నారని టాక్.
తిరుపతి ఎంపిక వెనక అంత ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదు. 2009 ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుండి పోటీ చేశారు. సొంత ఊరైన పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయినా తిరుపతిలో మాత్రం భారీ మెజారిటీతో విజయధుందుబి మోగించారు. అంతేకాదు ప్రజారాజ్యం పార్టీ స్థాపన కూడా అక్కడే జరిగింది. కాబట్టి అన్నయ్యను ఆదరించిన తిరుపతి ప్రజలు తనను కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో పవన్ ఉన్నారంట. అందుకే అక్కడి నుండి పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారంట.
అంతేకాదు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బలిజ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. కాపులు ముఖ్యమంత్రి కావాలన్నది ఆ సామాజికవర్గం బలమైన కోరిక. పవన్ తిరుపతిలో పోటీ చేస్తే విజయావకాశాలు అధికంగా ఉంటాయని పార్టీ స్టీరింగ్ కమిటీ కూడా ఆలోచించినట్లు తెలిసింది. అందుకే అక్టోబర్ 5 నుండి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు తిరుపతి నుండే శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు ఖరారైతే పవన్ గెలుపు నల్లేరుమీద నడకే అవుతుందని జనసైనికులు ఖుషీ అవుతున్నారంట.