తిరుపతిలో 18 మంది రెడ్లను నియమించుకున్నారు : టీడీపీ నేత వర్ల రామయ్య

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. తనవాళ్లకు బంగారుపళ్లెంలో పెడుతూ.. ఇతర కులాలకు చెందిన వారిని దూరం పెడుతున్నారని మండిపడ్డారు.  ప్రజాస్వామ్యబద్ధంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాల్సిన పాలనను జగన్మోహన్ రెడ్డి,  నాఇష్టం..నన్నెవరు అడిగేది అన్నట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.  తిరుపతిలో సామాజికన్యాయాన్ని ముఖ్యమంత్రి నిప్పుల్లో కలిపారని విమర్శించారు.

తిరుపతిలో కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో, టీటీడీ జేఈవో, సిమ్స్ డైరెక్టర్, బర్డ్స్ డైరెక్టర్, యూనివర్శిటీల వీసీలు, మహిళా యూనివర్శిటీ వీసీ వంటి 18మంది ఉన్నతాధికారులను రెడ్డి సామాజికవర్గం వారినే నియమిస్తే, అది లౌకికవాదమా… ప్రజాస్వామ్యపాలనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యమంటే భయంలేదని, రాజ్యాంగమంటే లెక్కలేదన, ప్రజలంటే ఖాతరు చేయరని దుయ్యబట్టారు.   కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకంలో ఒక్క ఎస్సీ(మాదిగ) కులస్తుడిని కూడా నియమించకపోవడం ఆ కులాన్ని అవమానించినట్టేని ఆక్షేపించారు.

సీనియర్ జాయింట్ కలెక్టర్ అయిన మాదిగ కులస్తుడిని కలెక్టర్ గా పోస్ట్ చేయకుండా, అతని జూనియర్లను కలెక్టర్లుగా వేయడం దళితులను అవమానించడమేనన్నారు.ముఖ్యమంత్రి సామాజికన్యాయానికి తిలోదకాలు ఇస్తే, భవిష్యత్ లో ప్రజలు ఆయనకు తిలోదకాలు ఇవ్వడంఖాయమని హెచ్చరించారు. లౌకికవాదానికి విరుద్దంగా జరిగిన నియామకాలను చీఫ్ సెక్రటరీ, డీజీపీలు సమీక్షించి, రెక్టిఫై  చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన 5గురు పోలీస్ అధికారులను డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే, 33మందిని ప్రమోట్ చేశారని అబద్ధాలతో గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేం సమాధానంచెబుతారని ప్రశ్నించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *