ఆర్‌ఆర్‌ఆర్: బ్రిడ్జ్ సీన్ మేకింగ్ వీడియో చూశారా..!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెరపై సృష్టించిన అద్భుతాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ చిత్రం భాషాభేదాలతో సంబంధం లేకుండా సినీ అభిమానులందరిని ఆకట్టుకున్నది. ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా పలు సినీ రికార్డులను బద్దలుకొట్టింది. పదకొండు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సన్నివేశాల్లో బ్రిడ్జ్ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి. ఈ సీన్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ సోమవారం అభిమానులతో పంచుకున్నది.
సినిమాలో రామ్‌చరణ్-తారక్‌లు మొదటిసారి కలుసుకున్నప్పుడు చూపించే బ్రిడ్జ్, ట్రైన్ యాక్సిడెంట్ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల చేత ఔరా అనిపిస్తున్నాయి. రాజమౌళి టేకింగ్‌ని, కెమెరా పనితనాన్ని, వీఎఫ్‌ఎక్స్.. ఇలా టీమ్ మొత్తాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ‘బ్రిడ్జ్ సీక్వెన్స్’ క్రియేట్ చేయడం కోసం డెన్మార్క్‌కు చెందిన ఓ బృందం ప్రత్యేకంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ చేసింది. రైల్వే బ్రిడ్జ్, దాని చుట్టు పక్కల ఉండే గ్రామీణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఆ బృందం రాజమండ్రికి చేరుకుని.. గోదావరి బ్రిడ్జ్.. దాని పరిసరాలను పరిశీలించి, ఫొటోలు తీసుకుంది. అనంతరం డెన్మార్క్ చేరుకుని వీఎఫ్‌ఎక్స్ వర్క్ ప్రారంభించింది.
బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటించారు. సముద్రఖని, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ ఎపిక్ మూవీకి ఎంఎం కీరవాణి సౌండ్‌ట్రాక్‌లు అందించారు.