మనమంతా సీఎం జగన్ కు అండగా నిలవాలి : మంత్రులు
చంద్రబాబు హయాంలో మద్యాన్ని జీవనదుల్లా పారించారని ఏపీ మంత్రులు మండిపడ్డారు. మద్యం పేరుతో చంద్రబాబు వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణస్వామి, అంజాద్ బాషా, మేరుగ నాగార్జున, జయరాం మాట్లాడారు. ‘‘మేము అధికారంలోకి రాగానే 43 వేల బెల్టు షాపులను తొలగించాం. నిన్న జరిగింది మహానాడు కాదు.. చంద్రబాబు వెన్నుపోటు సభ. తొడలు కొడితే ఓట్లు రావు.. ప్రజల మనసు గెలిస్తే ఓట్లు వస్తాయి. జగన్ సంక్షేమ పాలనతో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు రావడం ఖాయం.
చంద్రబాబు పాలన.. జగన్ పాలనపై చర్చిద్దాం రండి. మా నాయకుడు రాకపోయినా మా కోసం ప్రజలు తరలి వస్తున్నారు. బస్సు యాత్రకొస్తున్న స్పందన చూసి తండ్రి, కొడుకుకు నిద్ర పట్టడం లేదు. ధరల పెరుగుదలపై చంద్రబాబుకు దమ్ముంటే మోదీని ప్రశ్నించాలి. ఇక్కడ తొడలు కొట్టడం కాదు.. ఢిల్లీ వెళ్లి కొట్టండి.అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్ దే. కేబినెట్ లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారు. మనమంతా కలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి.
బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించింది సీఎం జగన్ మాత్రమే. అణగారిన వర్గాల సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక సీఎం జగన్. టీడీపీ హయాంలో ఒక్క మైనార్టీకి కూడా కేబినెట్ లో చోటు ఇవ్వలేదు. అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్ దే. కేబినెట్ లో 74 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు.’’ అని మంత్రులు పేర్కొన్నారు.