ఆ మంత్రి ఇక పోటీ చేయడంట..ఎందుకో తెలుసా?
రాజకీయంలోకి ఎవరైనా ఒకసారి అడుగుపెట్టారంటే మళ్లీ వదిలేయడం అసాధారణం. ఇక అధికారంలో ఉన్నవారికైతే ఆ భోగమే వేరు. వేసిందే బాట..చెప్పిందే వేదంగా అన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. అంతేకాదు పదవి పదిలం కావడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకుని చెలామని అవ్వాలని అనుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఆ మంత్రి వ్యవహార శైలి. ఎవరా మంత్రి.? ఎక్కడ.? ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీకి కంచుకోట. ఇక్కడ వైసీపీ డామినేషన్ అంతాఇంతాకాదు. జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీకి మెజారిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు.
అంతాబాగానే ఉన్న మొన్న ఇక్కడ గెలిచి మంత్రిగా కొనసాగుతున్న ఆదిమూలపు సురేష్ వ్యవహారం అంతుబట్టడం లేదు. కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, నియోజవర్గాన్ని గాలికొదిలేశారన్న విమర్శ వ్యక్తమవుతోంది. ఇటీవల పుల్లల చెరువు మండలం నాయకులు, సర్పంచులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీని నమ్ముకుంటే బొక్కబోర్లా పడ్డామని బాహాటంగా విమర్శలు చేశారు. సురేష్ ఇదే వ్యవహార శైలిని కొనసాగిస్తే ఏ మాత్రం సపోర్టు చేయమని తెగేసి చెప్పారంట అక్కడి నాయకులు. ఇదంతా తన దృష్టికి రావడంతో తాను ఇక పోటీ చేయదలచుకోలేదని తన ముఖ్యమైన అనుచరుల వద్ద చెప్పారని టాక్.
అవసరమైతే ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి అవుతానని చెప్పకనే చెప్పారంట. ఈ రాజకీయాలు తనకు అవసరం లేదని, నాయకులు బెదిరింపులకు భయపడే పరిస్థితే లేదని, తెగేసి చెప్పారంట. మంత్రి వ్యాఖ్యలు విన్న సదరు నాయకులు అవాక్కయ్యారని తెలుస్తోంది. తాము ఏదో ఆశించి సమావేశానికి వస్తే మంత్రి మాటలు చూసే బెంబేలెత్తిపోయారంట. అంతేకాదు..బాలినేని ఆగ్రహానికి కూడా మంత్రి సురేష్ గురవడంతో ఈ సారి ఓటమి తప్పదన్న భావనలో సురేష్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే యర్రగొండపాలెంనుకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.