నాగశౌర్య పాట.. సుమ ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్ చూశారా..!
నాగశౌర్య హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఉషా ముల్పూరి నిర్మించారు. షిర్లీ సేథియా కథానాయిక. ఈనెల 22నే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నాగశౌర్య తన బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాకి అనీశ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన సినిమా ఇది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి ఒక సాంగును రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మరో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు .. మారిందిరా అందం చరిత్ర నేడు’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. ఫారిన్ లో పుట్టిపెరిగిన హీరోయిన్ ను వెంటబెట్టుకుని తన విలేజ్ కి తీసుకుని వస్తాడు. ఇక్కడి వాళ్లంతా ఆమెకి ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతారు. ఆ సంతోషంలో హీరో పాడుకునే పాట ఇది. హర్ష సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హరిచరణ్ ఆలపించాడు. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీని అందించాడు. కాగా ఈ సినిమాలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతమందించారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు.
అటు ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. కుటుంబకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్ ట్రైలర్‌ను నటుడు మహేశ్‌బాబు విడుదల చేశారు. సుమతోపాటు చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఆయన ఈ ట్రైలర్‌ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.
గ్రామీణ మహిళగా ఉత్తరాంధ్ర యాసలో సుమ చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రామంలోనే గడుసైన మహిళగా పేరున్న జయమ్మ ఉన్నట్టుండి పంచాయితీకి ఎందుకు వెళ్లింది? గుండె సమస్యతో బాధపడుతున్న తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె ఏం చేసింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ‘జయమ్మ పంచాయితీ’ రూపుదిద్దుకుంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందించారు. బలగా ప్రకాశ్ నిర్మాత.