రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన ‘గని’ సినిమా
యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘గని’ . కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఎక్కువగా లవ్ స్టోరీలతో పలకరించిన వరుణ్ ఈ సినిమాలో మాత్రం బాక్సర్‌గా కనిపించాడు. అయితే ఈ యాక్షన్ మూవీ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. అంచనాలకు తగ్గట్లుగా ఫలితాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో మొదటి వీకెండ్ లోనే చాలా థియేటర్ల నుంచి సినిమాను తీసేశారు. ఇక ‘బీస్ట్’, ‘కేజీఎఫ్2’ లాంటి సినిమాలు విడుదల కావడంతో ‘గని’ అడ్రెస్ లేకుండా పోయింది.
ఈ సినిమా ఫెయిల్ అయిందని వరుణ్ తేజ్ స్వయంగా ఒప్పుకున్నారు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. రిజల్ట్ విఫలమైనా.. లెర్నింగ్ అనేది ఆగదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఏ సినిమా అయినా విడుదలైన నాలుగైదు వారాల తరువాతే ఓటీటీలోకి వస్తుంది. నిర్మాతలు అలానే అగ్రిమెంట్స్ చేసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా రెండు, మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ‘గని’ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవటంతో ఇదికూడా రెండు వారాలకే ఓటీటీ బాట పట్టింది.
‘గని’ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఆహా’ ప్లాట్‌ఫామ్ వేదికగా ఈ నెల 22న ‘గని’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే వరుణ్‌తేజ్‌కు జోడీగా నటి సయీ మంజ్రేకర్ నటించారు. నదియా, ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.