తెలుగు ఇండస్ట్రీపై హీరో సెటైర్లు.. దెబ్బ ఎలా ఉందంటూ నెటిజన్ల ట్రోలింగ్..!
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ బ్రేకుల్లేని బుల్డోజర్లా రికార్డులను తొక్కుకుంటూ పోతోంది. బాక్సాఫీస్ మీద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం హిందీలోనూ మంచి వసూళ్లు రాబడుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
అయితే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఇటీవల తన తాజా చిత్రం ‘ఎటాక్’ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ భాగంగా దక్షిణాది సినిమాలపై కొన్ని విమర్శలు గుప్పించాడు. తానో హిందీ హీరోనని, తెలుగుతో పాటు ఎటువంటి ప్రాంతీయ సినిమాలో నటించబోనని తేల్చి చెప్పాడు. డబ్బుల కోసం వేరే తెలుగు సినిమా చేయనని దురుసుగా వ్యాఖ్యానించటంతో ఈ కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీప్రియులు భగ్గుమన్నారు.
ఇక ఏప్రిల్ 1న ఎటాక్ చిత్రాన్ని మంచి అంచనాల మధ్య రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఆల్రెడీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ తన జోరును చూపిస్తూ దూసుకుపోతుండటంతో, ఎటాక్ సినిమా ఈ చిత్రంపై ఏకోసాన కూడా ఎటాక్ చేసినట్లుగా కనిపించలేదు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగా రావడం, వీకెండ్ కావడంతో నార్త్‌లో మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రేక్షకుల తాకిడి పెరగడంతో ఎటాక్ సినిమాకు కనీస కలెక్షన్లు కూడా రాలేదు. తొలిరోజైన శుక్రవారం నాడు ఎటాక్ సినిమాకు కేవలం రూ.3 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాగా, ఆర్ఆర్ఆర్కు అదే రోజున రూ.12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ రెస్పాన్స్‌ను షేర్ చేస్తూ ‘మరిప్పుడు జాన్ అబ్రహం తలెక్కడ పెట్టుకుంటాడో!’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.