ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత..మండిపడ్డ టీడీపీ నేతలు

కూల్చివేతల పర్వం ఏపీలో మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు టీడీపీ నేతల ఇళ్లపై గురిపెట్టిన ప్రభుత్వం తాజాగా పార్కులపైనా దృష్టి పెట్టింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్కును గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. 2014లో పార్కు నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయి. నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో పనులు ప్రారంభించారు. శనివారం తెల్లవారు జామున కొందరు వ్యక్తులు రెండు జేసీబీలతో అక్కడకు చేరుకుని ప్రహరీ, రీడింగ్ రూమ్, కార్యాలయ గదులతోపాటు అంతర్గతంగా వేసిన రోడ్లను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని టీడీపీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించగా కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత దారి తీసింది.  నరసన్నపేటలోని ఇందిరానగర్ కాలనీలో ఎర్రన్నాయుడు పేరిట చిల్డ్రన్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు 2014 టీడీపీ హయాంలోనే 2 కోట్ల వ్యయంతో పనులు మంజూరయ్యాయి.

గ్రామ పంచాయితీ నిధుల నుండి రూ.34లక్షలు ఇందుకోసం విడుదలవగా గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.  అయితే ఈ స్థలం కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి చెందిందని గతంలో తమకు కేటాయించినట్లుగా కొందరు చెప్తున్నారు. కానీ చిల్డ్రన్ పార్క్ నిర్మాణాన్ని ఇందులో చేపడుతున్నారని తమకు కేటాయించిన స్థలంలో చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలంటూ 15మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పటివరకు కార్యాలయ గదులు, రీడింగ్ రూం, ప్రహారితో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తవగా మిగతా పనులు ముందుకు సాగకుండా ఆగిపోయాయి.

వైసీపీ అధికారంలోకి రాగానే పార్క్ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నట్లు టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో రాత్రిపూట ఏకంగా రెండు జేసీబీలతో కొందరు పార్క్ వద్దకు చేరుకుని ముందుగా ప్రహారిని కూల్చి లోపలికి ప్రవేశించారు. రమణమూర్తి ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు కూల్చివేతను అడ్డుకున్నారు. అందుకు ఉపయోగించిన రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రమణమూర్తితోపాటు పాటు టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపి ధర్నాకు దిగారు. చిన్న పిల్లల కోసం నిర్మిస్తున్న ఈ పార్కును కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అరెస్ట్ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి డిమాండ్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *