జాబ్ నోటిఫికేషన్ అడిగితే జైల్లో పెడతారా? : అచ్చెన్నాయుడు

ఉద్యోగాలు ఇవ్వండన్న నిరుద్యోగులపై పాశవికంగా వ్యవహరిస్తూ అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ’’టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ సహా అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలి. అన్నొస్తే నిరుద్యోగుల కలలు సాకారమవుతాయని రోజూ ఊదరగొట్టిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వమన్న నిరుద్యోగుల్ని కాలర్ పట్టుకుని కటకటాల్లో పెడుతున్నారు. జగన్ రెడ్డి వచ్చాక నిరుద్యోగం 14శాతం పెరిగింది.

నిరుద్యోగుల ఆత్మహత్యల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్ రెడ్డిదే. ఉద్యోగాలు లేక సుమారు 400 మందికి పైగా యువకులు గత రెండున్నరేల్లలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. జగన్ ఇచ్చిన మాట మరిచిపోవడం వల్లే యువత రోడ్లపైకి వస్తున్నారు. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు. చివరికి ఏటా ఇస్తామన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా.. నోటిఫికేషన్ అడిగినందుకు అరెస్టులు చేయడం సిగ్గుచేటు. రెండున్నరేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేసిన జగన్ రెడ్డికి.. ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఏమాత్రమైనా ఉందా.?

విద్యార్థులు, నిరుద్యోగుల అరెస్టులు, గృహనిర్బంధాలు దుర్మార్గం పోలీసులు అడ్డంపెట్టుకుని విద్యార్థి యువజన నాయకులు భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం అరచేతితో సూర్యుడిని ఆపినట్లేనని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఏపీలో 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న జగన్ రెడ్డి ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా 66 వేల పోస్టులే ఖాళీ ఉన్నాయనడం యువతను వంచించడం కాదా.? అప్పుడేమో మేనమామ అని అన్నారు.. ఇప్పుడేమో కంసుడిలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగ యువతపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలి‘‘ అని డిమాండ్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *