అటవీ భూమిని దత్తత తీసుకున్న నాగార్జున.. ఎందుకంటే..!
తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ CM కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1,080 ఎకరాల అటవీ భూమిని నాగ్ దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి చెంగిచర్లలో కుటుంబ సమేతంగా అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు నాగార్జున శంకుస్థాపన చేశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, వాళ్ల కుమారులు నాగ చైతన్య, అఖిల్‌తో పాటు హీరోలు సుమంత్, సుశాంత్ సహా ఇతర కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు. ఈ పార్కు అభివృద్ధికి గ్రీన్ ఫండ్ ద్వారా రూ.2 కోట్ల చెక్‌ను అటవీ శాఖ ఉన్నతాధికారులకు నాగార్జున అందించారు.
భావి తరాలకు పచ్చదనంతో కూడిన పర్యావరణం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాగార్జున అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందకు రావటాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్ కే ఉందని, రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్దరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్ అన్నారు.