104 శాటిలైట్ల రాకెట్ ప్రయోగం విజయవంతమవ్వాలని కోరుతూ నెల్లూరు నుండి శ్రీహరికోటకు బైక్ ర్యాలీ

భారతదేశం గర్వించేలా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి  పిఎస్ఎల్వి సి 37 రాకెట్ ద్వారా 104 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపే ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు నగరంలోని గాంధి బొమ్మ నుండి శ్రీహరికోట షార్ కేంద్రానికి నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు.
మేయర్ అజీజ్  మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన షార్ రాకెట్ కేంద్రంలో ప్రయోగించే రాకెట్ ద్వారా 104 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతున్నారని తెలిపారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో శాటిలైట్ లను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా షార్ కేంద్రం అరుదైన రికార్డును నెలకొల్పిందని వివరించారు. పంపుతున్న వాటిలో 88 శాటిలైట్లు అగ్రదేశాలకు చెందినవనీ, మిగిలినవన్నీ చిన్నదేశాల అవసరాలకోసం తయారు చేసారని చెప్పారు. 2013వ సంవత్సరంలో అమెరికా దేశం 27, 2014లో రష్యా 37 శాటిలైట్ లను మాత్రమే అంతరిక్షంలోకి పంపించగలిగాయని  ఆయన గుర్తుచేశారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఈ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు మన దేశ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారన్నారు. వారి కృషిని అభినందించి, ప్రోత్సాహం కలిగించేందుకు బైక్ ర్యాలీని ప్రారంభించామని పేర్కొన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేయాలంటూ ఓ ప్రత్యేక పుష్పగుచ్చాన్ని బైకర్లకు మేయర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నూనె మల్లికార్జున యాదవ్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మైథిలీ మనోహర్ రెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి, నరసింహారావు, టిడిపి నాయకులు మౌలానా, షంషుద్దీన్, వివిధ పాటశాలల విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *