పవర్ హాలిడే వల్ల 10 లక్షల మంది ఉపాధికి గండి : నారా లోకేష్

ప‌వ‌ర్‌లో వున్న మీరు ప‌వ‌ర్ హాలీడే ప్రకటించ‌డం సులువేనని, కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర ప‌రిస్థితి ‎ఆలోచించారా? అని సీఎం జగన్ ను నారా లోకేష్ ప్రశ్నించారు. సీఎం జగన్ కు  బుధవారం లేఖ రాశారు. మొన్నటి వరకు కరోనా కష్టాలతో  నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటున్న సమయంలో పవర్ హాలిడే పాటించాలంటూ ఇచ్చిన ఆదేశాల‌తో అన్నిరంగాలు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత‌గా వున్నపుడు కనీసం క‌రెంటు చార్జీలు ఒక్కసారి కూడా పెంచ‌ని టీడీపీ ప్రభుత్వంపై.. ఎంతెంత బిల్లులు వేస్తారంటూ అవాస్తవాలు ప్రచారం చేశారని మండి పడ్డారు. అధికారంలోకి వ‌చ్చిన 3 ఏళ్లలోనే 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ‎ఇచ్చారని విమర్శించారు.

5 ఏళ్ల  చంద్రబాబు పాలనలో ఏనాడు కరెంట్ కోతలు లేవని,   జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యుత్ రంగాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో  మిగులు విద్యుత్ ఉందని, కానీ ఈ 3 ఏళ్ల పాలన ‎విధ్వంస విధానాల‌తో విద్యుత్ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు.  జగన్ అవగాహనారాహిత్యం, అనుభవలేమితో విద్యుత్ కొర‌త ఏర్పడి ఏకంగా ప‌రిశ్రమలకు ప‌వ‌ర్‌హాలీడే ప్రకటించే వ‌ర‌కూ దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.  దీనివ‌ల్ల‌ రోజుకు ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించుకోవాల్సి దుస్థితి నెలకొందన్నారు.

ప‌రిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా నెలవారీ అద్దెలు, చెల్లించాల్సిన వాయిదాలు, అప్పుల‌కు వడ్డీలు కట్టలేక యాజమాన్యాలు విల‌విల్లాడుతున్నాయన్నారు. ప‌రిశ్రమల్లో ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని ప‌రిస్థితి నెల‌కొందని, ఓ వైపు క‌రెంటు కోతలు, మ‌రోవైపు ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో అధికంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు వల్ల ‎జ‌న‌రేట‌ర్లు న‌డ‌ప‌లేక కుటీర‌, చిన్న ప‌రిశ్రమల నుంచీ పెద్ద ప‌రిశ్రమ‌ల వ‌ర‌కూ అన్నీ మూత దిశ‌గా సాగుతున్నాయని ఆరోపించారు.  పవర్ హాలిడే వల్ల అన్నిరంగాల‌కీ చెందిన‌ 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేనద వ్యక్తం చేశారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *