విద్యార్దులకు పరీక్షల సామాగ్రి అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
February 1, 2017
విలువలతో కూడిన విద్య లభించినపుడే విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపడుతుందని, తద్వారా దేశ భవిష్యత్తే మెరుగ్గా మారుతుందని, అలాంటి విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభ్యమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. విద్యా రంగంలో కార్పొరేట్ శక్తులు ప్రవేశించి సంప్రదాయాలకు, విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయని ఈ పద్ధతిలో మార్పు రావాలని కోరారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెనుబర్తి లోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో జరిగిన సరస్వతి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10 వ తరగతి విద్యార్ధులకు ఎక్జాం ప్యాడ్లు, పెన్నులు, స్టడీ మెటీరియల్స్ ను పంపిణీ చేశారు.
భారతదేశంలో సంప్రదాయాలు, విలువలు నేర్పాల్సిన అవసరం ఉన్నదని అందుకనుగుణంగా సిలబస్ లో మార్పులు చేయాలని కోరారు. తల్లిదండ్రుల తర్వాత గురువులే పూజ్యనీయులని, ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగిస్తున్నాయంటే కారణం ప్రభుత్వాలు, మాలాంటి రాజకీయ నాయకులు కాదని, ఉపాధ్యాయులేనని అన్నారు.
పెనుబర్తి గ్రామం స్వచ్ఛభారత్ లో జిల్లాకు ఏ విధంగా ఆదర్శంగా నిలిచిందో, ఈ పాఠశాల కూడా అదేవిధంగా గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్ధులకు పరీక్ష సామాగ్రి సమకూర్చిన మాజీ సర్పంచ్ వెంకటయ్యను శాలువాతో ఎమ్మెల్యే సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పుచ్చలపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చిట్టమూరు సుధాకర్ రెడ్డి, పల్లంరెడ్డి రవీందర్ రెడ్డి, దొడ్డి సుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ తిరుమలశెట్టి వెంకటయ్య, చిన్న మునెయ్య, పాకనాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.