బేతాళుడు పాటలతో ముందుకొచ్చాడు
November 7, 2016
ఈ ఏడాది విడుదలైన బిచ్చగాడు చిత్రం సాధించిన సంచలనాలను ఎవ్వరూ మర్చిపోలేరు. కోటి రూపాయల లోపు పెట్టుబడితో విడుదల అయిన ఈ అనువాద చిత్రం 25 కోట్లకు పైగానే వసూలు చేసి సరిక్రొత్త రికార్డులు సృష్టించింది.సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని కూడా అనేక కేంద్రాల్లో తొలగించి బిచ్చగాడు ని ప్రదర్శించారంటే ఆ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. ప్రయోగాత్మక చిత్రాలకు పేరుగాంచిన నటుడు, సంగీత దర్శకులు విజయ్ ఆంటోని ఇప్పుడు అదే స్ఫూర్తితో తన తాజా తమిళ చిత్రం ‘సైతాన్’ ను ‘బేతాళుడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. అందుకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. బిగ్ సీడీ ని ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. తొలి సీడీని హీరో నిఖిల్ విడుదల చేసారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ మనం వేదికలపై మాట్లాడేకంటే మన సినిమాలు థియేటర్ లలో మాట్లాడాలి అని కోరుకునే వ్యక్తిని నేను. ఆలా ఓ సరిక్రొత్త కథాంశంతో వెండితెరపై మాట్లాడిన చిత్రం బిచ్చగాడు అని అన్నారు. మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ విజయ్ ఆంటోని విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ బేతాళుడు రెగ్యులర్ చిత్రం కాదన్న విషయం ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమవుతుందని, ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. చిత్ర హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ తనకు 25 సినిమాలకు రావాల్సిన గుర్తింపును తమిళ, తెలుగు ప్రేక్షకులు 3 సినిమాలకే అందించారని వారి కోసం వైవిధ్యమైన పాత్రలు చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని, బేతాళుడు తప్పకుండా అందరికీ నచ్చుతాడని తెలిపారు. విజయ్ ఆంటోని సంగీత దర్శకత్వం అందించిన ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకులు. కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్ నిర్మాతలు. అరుంధతి నాయర్ హీరోయిన్. ఈ కార్యక్రమంలో యండమూరి వీరేంద్రనాథ్, బెల్లంకొండ సురేష్, చదలవాడ శ్రీనివాసరావు, ఫాతిమా విజయ్ ఆంటోని, టి.ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.