తమ యూనివర్సిటీ లో గత కొన్నేళ్లుగా ఎన్నో అక్రమాలు, అవినీతి, అరాచక వేధింపులు జరుగుతున్నా ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్ళినా, ఎంతమంది పోరాటాలు జరిపినా ప్రభుత్వం స్పందించట్లేదని ఇక తమకు పవన్ కళ్యాణే దిక్కంటూ ఆయన స్పందించి తమ పోరాటానికి మద్దతిచ్చి ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చేలా తోడ్పడాలని కోరుతూ నెల్లూరు నుండి పవన్ కళ్యాణ్ ను కలుద్దామని బయల్దేరిన నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధుల పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. విద్యార్ధుల నుండి వస్తున్న సమాచారం మేరకు వారి పాదయాత్ర గుంటూరు జిల్లా చిలకలూరిపేట నగరం వరకు చేరింది. రోజుకి 30 నుండి 40 కిలోమీటర్ల మేర నడిచేందుకే చాలా ఇబ్బందిగా మారిందని, పలువురి కాళ్ళకు బొబ్బలు లేచాయని, పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటూ, పెయిన్ రిలీఫ్ స్ప్రే లు కాళ్ళకు కొట్టుకుంటూ నడక కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేడి వాతావరణం కారణంగా విద్యార్ధులు విరోచనాల భారిన పడుతున్నట్లు తెలిపారు. అయినా కష్టాలను సైతం అధిగమిస్తూ తమ పాదయాత్రను కొనసాగిస్తున్నట్లు విద్యార్ధులు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పాదయాత్రపై స్పందించి ఏదైనా ప్రకటన విడుదల చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నామని విద్యార్ధులు తెలిపారు.
మొదటి రోజు నెల్లూరు నగరంలో బయల్దేరగా విద్యార్ధులు మధ్యాహ్నం పడుగుపాడు చింతాలమ్మ దేవస్థానంలో విశ్రాంతి తీసుకుని రాత్రికి రేగడిచెలిక గ్రామంలోని ఓ రైస్ మిల్లు ప్రదేశంలో నిద్రపోయారు. రెండవ రోజు మధ్యాహ్నానికి కావలి సమీపంలోని గౌరవరం శివాలయంలో విద్యార్ధులు విశ్రాంతి తీసుకుని రాత్రికి కావలి నగరం దాటిన తర్వాత రామదూత ఆశ్రమంలో నిద్రపోయారు. మూడవరోజు మధ్యాహ్నానికి సింగరాయకొండ ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో విశ్రాంతి తీసుకున్న విద్యార్ధులు రాత్రికి ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో ఓ విద్యార్ధి ఇంట నిద్రపోయారు. నాల్గవ రోజు ఉదయం ఒంగోలు నగరానికి చేరిన విద్యార్ధులు మధ్యాహ్నం అక్కడే ఒక ఎయిడెడ్ కళాశాల ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రాత్రికి మద్దిపాడు గ్రామంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహం నందు నిద్రపోయారు. అయిదవ రోజు మధ్యాహ్నం పిచికల గుడిపాడు వద్ద విశ్రాంతి తీసుకుని రాత్రికి మార్టూరు సమీపంలోని ఓ గుడిలో నిద్రపోయారు. ఆరవ రోజు చిలకలూరిపేటలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న విద్యార్ధులు రాత్రికి చిలకలూరిపేట గుంటూరు మధ్యలో బస చేస్తారు.
పలు చోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు తమకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు విద్యార్ధులు తెలిపారు.
ఏడవ రోజైన ఫిబ్రవరి 28 న గుంటూరు నగరం, ఎనిమిదవ రోజు మార్చి 1 కి విజయవాడ నగరానికి చేరుకోగలమని అటునుండి హైదరాబాద్ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని విద్యార్ధులు తెలిపారు.
తాము చేస్తున్న పోరాటం ఫలించి ప్రభుత్వం దర్యాప్తులు జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే తమ యూనివర్సిటీ భవిష్యత్ బాగుపడుతుందని, జిల్లా విద్యావ్యవస్థ మెరుగవుతుందని విద్యార్ధులు జొన్నలగడ్డ సుధీర్, కె.గంగిరెడ్డి, మల్లి శ్రీకాంత్ యాదవ్, జి.కిరణ్, శ్రీనివాసులు, వినయ్, అవులయ్య, సాయి వినయ్, వైభవ్, రాజేష్, గణేష్ తదితరులు తెలిపారు.
విద్యార్ధులను సంప్రదించాలంటే ఫోన్ నెంబర్లు 9959693322, 9848895902, 8886281814