స్విస్ బ్యాంకుల్లో నల్లధనం 2018 తర్వాత ఏమి కానుంది?

విదేశాల్లో భారతీయల నల్లధనం కొన్ని లక్షల కోట్లు మూలుగుతున్న విషయం తెలిసిందే. అందులో ప్రధాన వాటా స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంకులదే. మోడీ తన ఎన్నికల ప్రచారంలో విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొస్తాను అని ప్రచారం చేసి సఫలమయ్యారు. ప్రధానిగా పదవిని చేపట్టాక ఆ నల్లధనాన్ని బయటకు తెచ్చే విషయంలో సఫలీకృతం కాలేకపోయారు. దానికి కారణం స్విట్జర్లాండ్ లోని ప్రభుత్వ విధానాలే. అక్కడి బ్యాంకింగ్ విధానాల ప్రకారం తమ  కస్టమర్ల వివరాలు ఎవ్వరికీ బహిర్గతం అయ్యే వీలు లేదు. కానీ మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా స్విట్జర్లాండ్ పై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడుల మూలంగా ఆ దేశం కొన్ని సడలింపులు చేసింది. అదే ఇప్పుడు నల్లధనం పై యుద్ధం ప్రకటించిన మోడీ ప్రభుత్వానికి ఓ వరంగా మారింది. దీంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం తో భారత ప్రభుత్వం పరస్పర సమాచార మార్పిడి (ఆటోమేటిక్ ఎక్స్ చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం 2018 సంవత్సరం నుండి అమల్లోకి రానుంది. అంటే 2018 తర్వాత లావాదేవీలు జరిగే బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం మాత్రమే భారత్ కు స్విట్జర్లాండ్ తెలియపరుస్తుంది. పాత ఖాతాల వివరాలు తెలియవు. దీంతో ఇప్పటికే లక్షల కోట్లతో మూలుగుతున్న ఖాతాల సమాచారం తెలియకపోతే ఈ ఒప్పందం వల్ల ఏమిటి ఉపయోగం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఒప్పందం గురించి తెలిసి కూడా 2018 తర్వాత ఎవరైనా అక్కడ ఖాతా ప్రారంభిస్తారా అని అంటున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న ఖాతాలలో 2018 లో లావాదేవీ జరిగితే ఆ వివరాలు తెలుస్తాయా లేక పాత ఖాతాలు కాకుండా నూతన ఖాతాల వివరాలు మాత్రమే తెలుస్తాయా అనేది ఇంకా ప్రశ్నార్ధకంగానే మిగిలింది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్విస్ ఖాతాల నుండి ప్రపంచం లోని ఏ దేశం లోని ఖాతాల లోకి అయినా డబ్బు లావాదేవి జరిపితే ఆ వివరాలు భారత ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉన్నదని కనుక నల్లధన పరులు ఆ డబ్బును వేరే ఖాతాల లోకి మార్చుకోలేక 2018 తర్వాత అసలు లావాదేవీలే చేయలేక సతమతమయ్యి ఇక ఆ డబ్బును అలానే వదిలేసే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *