పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో విడుదల

సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ వేడుకలకు అంతగా హాజరు అవ్వరు. ఆయన రావట్లేదని మెగా వేడుకల్లో అభిమానులు చేసే గోల, హడావిడి అంతాఇంతా కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఓ సాధారణ కమెడియన్ అయినా సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే ఓ చిన్న చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు కుటుంబం లాంటిదని ఇదివరకు  పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి తరలిరావడంతో ఆడియో వేడుక కోలాహలంగా జరిగింది. ఆడియో ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సాధారణంగా తాను సినిమాలను ఎక్కువుగా చూడనని, కానీ సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాను చూడాలని ఉందని పేర్కొన్నారు. సప్తగిరి లోని ఎనర్జీ తనకు ఎంతగానో నచ్చుతుందన్నారు. సినిమా వేడుకలకు వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చే విధంగా తనని తాను ఎప్పుడూ చేసుకోలేదని, కానీ అభిమానుల ప్రేమకు స్పందిస్తానని అన్నారు. సప్తగిరి గబ్బర్ సింగ్ లో ఓ చిన్న సన్నివేశంలో నటించారు. అది చూసి ఎంతగానో నవ్వుకున్నానన్నారు. అప్పటి నుండి అతన్ని కలవాలని అనుకున్నానని, ఇప్పటికి కుదిరిందన్నారు. శరత్ మరార్ తో తీస్తున్న సినిమాకు ‘కాటమరాయుడు’ పేరు పెడదామనుకున్నాం. ఆ సమయంలో ఆ పేరు సప్తగిరి దగ్గర ఉన్నది. ఆ విషయం నాకు తెలీదు. మా నిర్మాతలు అడిగిన వెంటనే ఉన్నతమైన సంస్కారంతో ఆ టైటిల్ మాకు ఇచ్చారు. కానీ అప్పటికే వాళ్ళ సినిమా 80 శాతం పూర్తయింది. టైటిల్ తీసుకున్నందుకు నాకే సిగ్గుగా అనిపించింది. వద్దన్నాను. కానీ వాళ్లే ఇచ్చారు. ఆ టైటిల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని తెలియజేసారు. చిత్ర దర్శకులు అరుణ్ పవార్ తనకు బాగా తెలుసని, తన స్నేహితుడు త్రివిక్రమ్ కు బాగా కావాల్సిన వ్యక్తని, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా సహాయం చేసారని, తనకు ఈ సినిమాతో మంచి విజయం దక్కాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సప్తగిరి మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నడూ ఊహించని సంఘటన ఇది, పుట్టినప్పటి నుండి చిరంజీవి అభిమానిగా పెరిగానని, తన మనసుతో  సార్లు ఆయనతో మాట్లాడానని తెలిపారు. అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ తన ఆడియోకి వచ్చారేమో అనిపిస్తుందని భావోద్వేగంతో స్పందించారు. పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేసారు. పవన్ కళ్యాణ్ తనకు ఓ చిన్న పిల్లాడిలా, ఓ యోగి లా, భవిష్యత్తులో చరిత్ర సృష్టించే వ్యక్తిగా కనిపిస్తున్నారని తెలిపారు. తనలో పవన్ కళ్యాణ్ ఆవహించారని, ఆయన సినిమాల కోసం చొక్కాలు చించుకుని థియేటర్ లలో తిరిగిన రోజులున్నాయని తెలిపారు. ఆయన కోసం ఎంత దూరం వెళ్లడానికైనా, ఏమి చేయడానికైనా సిద్ధమని తెలిపారు. రోహిణి ప్రకాష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అరుణ్ పవార్ దర్శకులు. విజయ్ బుల్గానిస్ సంగీత దర్శకులు. రవికిరణ్ నిర్మాత. ఈ కార్యక్రమంలో అలీ, సునీల్, మారుతి, శరత్ మరార్, రామ్ ప్రసాద్, సింధూరపువ్వు కృష్ణారెడ్డి, శివ ప్రసాద్, కమలాకర్ రెడ్డి, నాగ అన్వేష్, చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *