పక్షుల పండుగ సరే – మరి పక్షులేవి?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ జరపనుంది. ఇందుకోసం ఇప్పటికే 2 కోట్ల రూపాయలు కేటాయించింది. అంచనాలు పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఈ పక్షుల పండుగను ప్రతిఏటా మన నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రం మండలంలో గల నేలపట్టు గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పక్షుల రక్షిత కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. రక్షిత కేంద్రం వెలుపల గల చెరువులో ఏపుగా పెరిగిన కడప వృక్షాలపై విదేశాల నుండి వివిధ రకాల పక్షులు సంతానోత్పత్తి కోసం వస్తాయి. ఒక సీజన్ పాటు ఉండి గుడ్లు పొదిగి పిల్లలు ఎదిగిన క్రమంలో తమ స్వంత ప్రాంతాలకు పయనమవుతాయి. ఆస్ట్రేలియా, నైజీరియా, సైబీరియా, పాకిస్థాన్, కజకిస్థాన్ వంటి సుదూర ప్రాంతాల నుండి పెలికాన్లు, నత్తగుల్ల కొంగలు, నీటి కాకులు, తెల్ల కంకణాలు, గూడబాతులు ఇక్కడకు వస్తుంటాయి. నేలపట్టు రక్షిత కేంద్రంలోని చెట్లపై గూళ్ళను ఏర్పచుకుని ఆహార అవసరాల నిమిత్తం పులికాట్ సరస్సు మరియు సమీప సముద్ర పరిసరాల్లో చేపల వేటకు వెళ్తాయి ఈ పక్షులు. అయితే ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితులు సరిగా లేని కారణంగా దొరవారిసత్రం, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. త్రాగునీరుకు కూడా ప్రజలు కటకటలాడుతున్నారు. నేలపట్టు చెరువు కూడా బీడుగా మారింది. ఈ క్రమంలో ఇక్కడ పక్షులు నిలిచే పరిస్థితులు సన్నగిల్లాయి. ఇప్పటికే ఇక్కడకు విచ్చేసిన పెలికాన్ పక్షులు పరిస్థితులు సరిగా లేక తిరుగు ప్రయాణమయ్యాయి. అరకొరగా వచ్చిన పక్షులు సైతం పులికాట్ పరిసరాల్లో  నీటి వనరులు లభ్యమయ్యే చోటే ఉంటున్నాయి. పక్షుల కేంద్రం పక్షులు లేక వెలవెలబోతున్నది. ఈ క్రమంలో ఈ నెల 27న ప్రారంభం కానున్న పక్షుల పండుగ పక్షులు లేక ఎలా కొనసాగుతుందా అనే సందేహాలు వెలువెత్తుతున్నాయి. తెలుగుగంగ ద్వారా నేలపట్టు చెరువుకు నీటి తరలింపు ఉంటుందేమోనని పలువురు భావిస్తున్నారు.

పక్షుల పండుగ పేరుతో తారల తళుకుబెళుకులు, రాజకీయ విమర్శలు

ప్రతిఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ సందర్భంలో పర్యావరణ, ప్రకృతి అభివృద్ధి కోసం ఎన్నో వాగ్ధానాలు చేస్తున్నా అవి ఆచరణకు మాత్రం నోచుకోవట్లేదు. పర్యావరణ పరిస్థితులు బాగుండక పోవడంతో క్రమక్రమంగా పక్షులు రావడం తగ్గిపోతున్నది. పక్షుల పండుగ పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ ఆర్భాటం కూడా విమర్శలను ఎదుర్కొంటున్నది. నేలపట్టులో పక్షుల రక్షిత కేంద్రం ఉండగా పక్షుల పండుగ పేరుతో వివిధ కార్యక్రమాలను సూళ్లూరుపేట ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతిసారి నాయకుల రాజకీయ బలం చూపించేందుకు, విమర్శలు చేసుకోవడానికి తప్పితే దేనికీ ఉపయోగపడడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇది చేసింది, మేము ఇది చేస్తున్నాం అంటూ రాజకీయ విమర్శలు ఎక్కువవుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో పక్షుల పండుగకు కేటాయించిన నిధులు ఎక్కువుగా ఖర్చవుతున్నాయి. గతంలో తమన్నా, శ్రీయ, ఛార్మి వంటి హీరోయిన్ లు ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో సూళ్లూరుపేట వచ్చి కేవలం సాంస్కృతిక కార్యక్రమాలలో యువతను హుషారెత్తించేందుకే పరిమితమయ్యారు తప్పించి ఆ సెలబ్రిటీలను పక్షుల రక్షిత కేంద్రంలోకి తీసుకెళ్లి పక్షులను, ప్రకృతిని రక్షిస్తే కలిగే లాభాల గురించి తెలిపే అవగాహనా కార్యక్రమాల ఏర్పాటు చేసిన పాపాన పోలేదు పాలకులు. మరోప్రక్క ఈ కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల హడావుడి అంతాఇంతా కాదు. ఇలా పక్షుల పండుగ పేరుతో నిధులను దుబారా చేస్తూ ప్రజల్ని మైమరపించే ఏర్పాట్లు చేస్తున్న నాయకులు ఆలా కాకుండా ఆ నిధులను కరువు తో అల్లాడుతున్న ప్రాంతాన్ని అభివృద్ధి పరచేందుకు ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *