నెల్లూరులో సినిమా థియేటర్ల దోపిడీ నశించాలంటూ డివైఎఫ్ఐ ధర్నా

నెల్లూరు నగరంలో ఉన్న సినిమా హాళ్ళలో తీవ్ర స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ప్యాకేజీల పేరుతో తినుబండారాలను బయటి మార్కెట్ లో ధరల కంటే కూడా అధికంగా ఎంఆర్పీ ముద్రించి అమ్ముతున్నారని, వాహనాల పార్కింగ్ కోసం ఏ థియేటర్ లో కూడా షెడ్డులు లేవని, వాహనాలు ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ ఉంటాయని కానీ మహానగరాల్లో కూడా లేని విధంగా 20 రూపాయల పార్కింగ్ ఛార్జీ వసూలు చేస్తున్నారని, టికెట్లను సాధారణ ప్రేక్షకులకు ఇవ్వకుండా వి.ఐ.పీలకు, అభిమాన సంఘాల నేతల వారికి అంటూ బ్లాక్ చేసి పడేస్తూ బ్లాకు మార్కెట్ లో విక్రయిస్తున్నారని, సింగల్ థియేటర్ ఉన్న చోట కూడా మల్టీప్లెక్స్ తరహాలో టికెట్ రేట్లు ఎలా వసూలు చేస్తారని, ప్రభుత్వ జీవో లకు విరుద్ధంగా జరుగుతున్న ఈ దోపిడీ ప్రభుత్వానికి తెలియదా అని, ఈ దోపిడీ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని తెల్పుతూ, తక్షణం ఈ దోపిడీని అరికట్టే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నగరంలోని వీఆర్సీ వద్ద గల లీలామహల్ ఎదుట భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) నాయకులు ధర్నా చేపట్టారు.
లీలామహల్ ఎదుట ధర్నా చేపడుతున్న సమయంలో విచ్చేసిన పోలీసులతో డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఈ థియేటర్ వారు పార్కింగ్ ఛార్జీల కోసం బయట వాహనాలు నిలుపరాదని పార్కింగ్ కు అవకాశం ఉన్న స్థలంలో ప్రభుత్వ రోడ్డు పై తాళ్ళు  కట్టి నో పార్కింగ్ బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది నిబంధనలకు విరుద్ధం కాదా అని తెలిపి ఆ బోర్డులను తీసి వేయించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు, బహిరంగ మార్కెట్లో ధరలకు పోలిక లేకుండా తినుబండారాలు, కూల్ డ్రింకులు, ఆఖరికి మంచి నీరు పై కూడా నగరం లోని ఎస్2 మల్టీప్లెక్స్, అర్చన, లీలామహల్, నర్తకి, సిరి థియేటర్ల వారు తమ స్వంత ధరలను ఎంఆర్పీగా ఎలా ముద్రింపజేస్తారని ప్రశ్నించారు. పార్కింగ్ కు షెడ్డు లేకుండా వాహనాలు ఎండలో ఎండుతూ ఉంటే పార్కింగ్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని రద్దు చేయాలని తెలిపారు. మహానగరాల్లో కూడా 10 రూపాయల కంటే పార్కింగ్ ఛార్జీ ఎక్కువ ఉండదని కానీ ఇక్కడ 20 రూపాయలు ఏ ప్రాతిపదికిన వసూలు చేస్తారని ప్రశ్నించారు. టికెట్లను కౌంటర్లలో ఇవ్వకుండా బ్లాక్ చేసేసి బ్లాకు మార్కెట్ లో అమ్ముతున్నారన్నారు. ముల్టీప్లెక్స్ లు కాని సింగల్ థియేటర్ లలో సాధారణ థియేటర్ ల మాదిరి ప్రభుత్వ జీవోల ప్రకారం టికెట్ ధరలు ఉండాలని తెలిపారు. ఈ థియేటర్ ల తీరుతో సామాన్య ప్రేక్షకులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయమై ప్రజా సంఘాలతో పౌర సంబంధ కమిటీలు వేసి అక్రమాలను నిరోధించాలని కోరారు. ప్రేక్షకులను మోసం చేసే, ఇబ్బంది పెట్టే థియేటర్ లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కానిచో ఈ విషయమై పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర, రూరల్ కార్యదర్శులు యు.ప్రసాద్, ఒ.సుధీర్, నాయకులు రాము, చిన్నా, ఫయాజ్, పెంచల నరసింహ, వెంకట్, రమేష్, భైరవ, సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి, నాయకులు నందకిరణ్, సాయి, సనత్ తదితరులు పాల్గొన్నారు.       

Add a Comment

Your email address will not be published. Required fields are marked *