నిషిత్ మృతికి పలువురి సంతాపం

హైదరాబాద్ లో అతి వేగంతో ఘోరప్రమాదానికి గురై దుర్మరణం పాలైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమారుడు నిషిత్ మృతదేహం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో పోస్ట్ మార్టం పూర్తి చేసుకుంది. మరణ వార్త విన్న పలువురు హైదారాబాద్ జూబ్లీ హిల్స్ లోని నారాయణ నివాసం మరియు అపోలో హాస్పిటల్ వద్ద గుమిగూడారు.
నిషిత్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఎపి మరియు తెలంగాణ మంత్రివర్గం తమ సంతాపాన్ని తెలిపారు. పలువురు మంత్రులు, సినీ నటులు, ప్రముఖులు అపోలో ఆసుపత్రి వద్ద వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అపోలో వద్దకు చేరుకొని నారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పోస్టు మార్టం పూర్తైన మృతదేహాన్ని నెల్లూరుకి తరలించనున్నారు. నేటి సాయంత్రానికి మృతదేహం నెల్లూరు లోని నారాయణ స్వగృహానికి చేరనుంది. మరోవైపు లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ నేటి రాత్రికి చెన్నై విమానాశ్రయం చేరుకొని అటునుండి నెల్లూరు రానున్నారు. రేపు నెల్లూరు నగరంలో నిషిత్ మృతదేహానికి అంత్యక్రియలు జరపనున్నారు.
నారాయణ జిల్లాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థల అధినేత మరియు రాష్ట్ర మంత్రి కావడంతో జిల్లాలో నిషిత్ మరణ వార్త తీవ్ర చర్చనీయాంశం అయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *