నారా లోకేష్ పర్యటన విజయవంతం – పలు ప్రశంసలు, పలు విమర్శలు

జిల్లాలో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ర్యాలీలు, సభలు, ఇష్టా గోష్టిలతో పర్యటన విజయవంతం అయినా పార్టీ పరిస్థితి జిల్లాలో ఎంత వైఫల్యంగా ఉన్నదో ప్రజలకు అవగతమైంది. రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ అమరావతి ప్రాంత అభివృద్ధికే ఎక్కువ సమయం కేటాయించడంతో జిల్లాలో స్థానిక ప్రజలతో మమేకమవుతూ కేడర్ ను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. దీంతో పర్యటనలో పార్టీ కేడర్ ఎవరికి తోచిన విధంగా వారు నడుచుకున్నారు. అందర్నీ సమన్వయ పరచే, అందర్నీ కంట్రోల్ చేసే నాయకుడు కొరవయ్యాడు. పర్యటనలో ప్రశంసలు వరకు బాగానే ఉన్నా పలు చోట్ల ప్రజల నుండి, విద్యార్థుల నుండి బహిరంగ విమర్శలు ఎదురయ్యాయి. స్వచ్ఛంద ప్రజా స్పందనే కావొచ్చు లేదా ప్రతిపక్షాలకు చెందిన వారే కావొచ్చు, వారి నుండి విమర్శనాస్త్రాలు వచ్చే స్థాయిలో ఏర్పాట్లు జరిగాయంటే ఇది ఖచ్చితంగా నాయకత్వ  లోపమే. పక్కా ముందస్తు ప్రణాళికలు లేకుండా, కేడర్ మొత్తాన్ని దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడమే ఇలాంటి పరిస్థితులకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓ రకమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పార్టీలో కేడర్ ని, ప్రజలను సమన్వయ పరచుకునే నాయకుడు ఎవరో ప్రజలకు అర్థం కాక తికమకపడుతున్నారు. అనేక మంది ఒకే రకమైన సమస్యల పరిష్కారం కోసం పార్టీ లోని అనేక మంది నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ శాఖల్లోని అధికారులు అధికార పార్టీ అయినా కానీ తెలుగుదేశం నాయకుల మాట వినే పరిస్థితులు సన్నగిల్లాయి. ప్రభుత్వం లోని వివిధ శాఖలు, బ్యాంకింగ్, యూనివర్సిటీ వంటి శాఖల్లోని అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్లను కూడా ఎత్తే పరిస్థితిలో లేరు. ప్రజా సమస్యలు పరిష్కారం కావట్లేదు. ప్రజల్లో పార్టీ నాయకత్వం పై నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ప్రతిపక్షానికి బలమయ్యే అవకాశంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో లోకేష్  సైతం ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది అంటూ అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేస్తూ ప్రసంగాలను కానిచ్చారు తప్పించి ఐక్యంగా లేని కేడర్ ను ఐక్యం చేసే ఏర్పాట్లను చేయలేకపోయారు. జిల్లా మంత్రి మరియు ఇన్ ఛార్జ్ మంత్రికి  ఒక దశలో సున్నితంగా చురకలంటించారు కాని కేడర్ కు, ప్రజలకు భరోసా కల్గించేలా నాయకత్వాన్ని బలపరచే ప్రయత్నాలు చేయలేకపోయారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *