నగరంలో పెరిగిన 5 సినిమా స్క్రీన్లు – ఇకనైనా ఇబ్బడిముబ్బడి టికెట్ల పంపిణీకి అడ్డుకట్ట పడేనా?

క్రొత్త సినిమాలు విడుదలైన ప్రతిసారీ నెల్లూరు నగరంలో తలెత్తే ఇబ్బంది థియేటర్ల కొరత. భారీ చిత్రాల విడుదల సమయంలో అయితే ఈ కొరత తీవ్రతరంగా ఉంటుంది. నగర జనాభా డిమాండ్ కు తగినట్లు టికెట్లు ఈ థియేటర్లలో  అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టార్ హీరోల చిత్రాలకు ఆన్ లైన్, కౌంటర్లలో టికెట్లు అందుబాటులో ఉంచడం థియేటర్ యాజమాన్యాలకు కత్తిమీద సాములా మారింది. విస్తృత స్థాయిలో వస్తున్న ఒత్తిళ్ళు, సిఫార్సుల కారణంగా టికెట్లను ఆన్ లైన్, కౌంటర్ల నుండి నిలుపుదల చేసి సిఫార్సులకు అందించే పరిస్థితులు ఏర్పడ్డాయి. సిఫార్సుల రూపేణా టికెట్లను చేజిక్కించుకున్న పలువురు బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరుపుతున్నా అడ్డుకునే చర్యలు నామమాత్రంగా ఉన్నేయి ఇన్నాళ్ళు నెల్లూరు నగరంలో.
ఈ వ్యవహారం మొత్తం వీటిని పర్యవేక్షించాల్సిన జాయింట్ కలెక్టర్, పోలీసు విభాగాల వారికి తెలిసినా నగరంలో తీవ్రంగా ఉన్న థియేటర్ల కొరత మరియు రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ వచ్చారు.
కానీ ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపించే అవకాశం ఉన్నది. నగరంలో ప్రధానంగా ఉన్న 8 థియేటర్ స్క్రీన్ లకు తోడు ఎంజిబి ఫెలిసిటి మాల్ లో మరో 5 స్క్రీన్స్ ఏర్పాటయ్యాయి. దీంతో ఇప్పుడు థియేటర్ స్కీన్ ల సంఖ్య 13 కు చేరింది. ఇన్నాళ్ళు ఉన్న కొరత వీటి ఏర్పాటుతో కొంత మేర తీరనున్నది. ఇనాళ్లు సిఫార్సుల కారణంగా టికెట్లను అందుకోలేని సాధారణ ప్రేక్షకులు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు కొంటూ తమ జేబులకు చిల్లులు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు టిక్కెట్ల పంపిణీ వ్యవహారాలను క్రమబద్ధీకరించి సాధారణ ప్రేక్షకుల జేబులకు చిల్లులు పడకుండా చూడాలని నగర ప్రజానీకం అభిలాషిస్తున్నారు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *