వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తా : మాజీ జేడీ లక్ష్మీనారాయణ

రాజ‌కీయంగా మ‌హిళ‌ల‌కు 33 శాతం కాకుండా 50 శాతం రిజ‌ర్వేష‌న్ కావాల‌ని సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే, విద్య, ప‌రిశోధ‌న‌, వాణిజ్యంతోపాటు రాజ‌కీయ స‌హ‌కారం కూడా ఎంతో ముఖ్య‌మ‌న్నారు. త‌న పుట్టిన రోజు వేడుక‌ను ఆదివారం అనాధ బాల‌ల మ‌ధ్య జ‌రుపుకున్నారు జేడీ. అనంతరం బాల‌బాలిక‌ల‌తో జరిగిన ఇష్ఠాగోష్ఠిలో జేడీ పలు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు.  రాజ‌కీయ వ్య‌వ‌స్థ బాగుంటేనే, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. 2024 ఎన్నిక‌ల్లోనూ  బ‌రిలో ఉంటానని, చ‌ట్ట స‌భ‌ల‌కు త‌న‌ను పంపితే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ పై నిల‌దీస్తాన‌ని స్పష్టం చేశారు.

ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార‌ని, విద్యార్థులు ప్ర‌శ్నించ‌గా…త‌నది స‌రికొత్త ప్ర‌జల‌ పార్టీ అని సమాధానమిచ్చారు. యువ‌త‌రం మంచి ఉన్నత చ‌దువులు చ‌దివి, మంచి స్థానాల‌ను ఆక్ర‌మించి, దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాజ‌కీయానికి కూడా తోడ్పాటు అందించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని పిలుపునిచ్చారు. అయితే గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖపట్నం నుండి నిలబడిన జేడీ ఓటమి చవి చూశారు. అనంతరం జనసేనకు రాజీనామా చేసి, ఏ పార్టీలోనూ చేరలేదు. పదెకరాలు పొలం కౌలుకు తీసుకుని దాన్ని సాగు చేస్తున్నారు.

అయితే బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినా ఆయన స్పందించలేదు. జగన్ అవినీతిపై గతంలో విచారణ చేయడం వల్ల వైసీపీలో చేరే ప్రసక్తే లేదు. ఇక టీడీపీలో చేరతారని వచ్చినా ఆయన స్పందించలేదు. లేదా మళ్లీ జనసేనలో చరతారా అన్న ఊహాగానాలేమీ లేవు. ఇటీవల కాపు నేతలు జరిపిన రహస్య సమావేశంలోనూ జేడీ పాల్గొన్నారు. కాపులు రాజకీయంగా ఎదగాలన్న ఆ సామాజిక వర్గ నేతల వ్యాఖ్యలను జేడీ బలపరుస్తున్నారు. సమావేశాలతో పావులు కదుపుతున్న జేడీ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారన్నది చూడాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *