జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం – పవన్ కళ్యాణ్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడమే లక్ష్యం అంటూ ప్రకటన
November 12, 2017
నెల్లూరు నగరంలో జనసేన పార్టీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గత కొద్ది కాలంగా నగరంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నడుంబిగించారు జనసేన కార్యకర్తలు. ఇటీవల యూనివర్సిటీ విద్యార్ధుల అడ్మిషన్ల సమస్య మొదలు బీసీ విద్యార్ధుల హాస్టల్ సమస్య, నగరంలో రోడ్ల దుస్థితి తదితర అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారం దిశగా పోరాటం జరుపుతూ నగరంలో పార్టీ బలోపేతానికి పూనుకున్నారు జనసేన కార్యకర్తలు.
భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన, పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సుమారు 300 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జనసేన పార్టీని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన విధానాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్దామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పటిష్టతకు తీసుకుబోయే చర్యల గురించి చర్చించారు. తమ తమ ప్రాంతాల్లో వివిధ రకాల ప్రజలు, మహిళలు, విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పై క్షుణ్ణంగా అధ్యయనం చేసి సంబంధింత అధికారులను ప్రశ్నిద్దాం అని అన్నారు. సమస్యల పరిష్కారం కొరకు ప్రశ్నిస్తూ నిరంతర పోరాటాలు జరపడమే జనసేన కార్యకర్తలుగా తమ తక్షణ కర్తవ్యమన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఒకవేల ఓటు హక్కు లేని వారిని గుర్తిస్తే తక్షణం ఓటరుగా నమోదయ్యే చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా నమోదు కాని వారు ఈ నెల 14 వ తేదిన నగరంలో జరిగే జనసేన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో ఆధార్ కార్డు, ఓటరు కార్డు తీసుకువచ్చి నమోదు చేసుకోవచ్చు అని అన్నారు. ప్రజా జీవన విధానాలలో మెరుగైన మార్పులే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు రాజా యాదవ్, చిన్ని, ఆనంద్, మధు, గంగిరెడ్డి, సుధీర్, సాయి, చరణ్, మహిళా కార్యకర్తలు కృష్ణవేణి, నాగరత్న, విజయలక్ష్మి, రోజారాణి, గీత, హరిప్రియ, కళారాణి, సునీత, రవణమ్మ, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.