ఏటీఎంలలో విత్ డ్రాల్ లిమిట్ లను ప్రభుత్వం పెంచాలని బ్యాంకు ఉద్యోగుల డిమాండ్

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాము అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంటూ బుధవారం నాడు నెల్లూరు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బృందావనం లోని ఆంధ్రాబ్యాంకు నెల్లూరు ప్రధాన శాఖ వద్ద వివిధ బ్యాంకుల ఉద్యోగులు నిరసన తెలియజేసారు. 
ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (AIBEA) జిల్లా కార్యదర్శి వి.ఉదయ కుమార్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంకు జిల్లాలోని బ్యాంకులకు తగినంత నగదు సమకూర్చకపోవడం మూలంగా మరియు ప్రభుత్వ నిర్ణయాలలో పలు మార్పుల కారణంగా బ్యాంకింగ్ ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయని తెలిపారు. ఏటీఎం లలో పూర్తి స్థాయిలో నగదు ఉండేలా చూసి ప్రజలకు విత్ డ్రాయల్ లిమిట్ లను పెంచాలని, బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు క్యూలలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని కోరారు. బ్యాంకు ఉద్యోగుల పట్ల పలువురు రాజకీయనాయకులు అవగాహనారాహిత్యంగా మాట్లాడడం ఆపాలని కోరారు. నల్ల ధనం కల్గిన వారిని రూపుమాపేలా సీబీఐ విచారణ జరపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో AIBEA జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ సింగ్, సభ్యులు రామ్మోహన్, కుమార్, రఘు, కిరణ్, సుమన్ మరియు వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *