మెడికల్ సీట్ల రద్దు, మున్సిపల్ కమీషనర్ మార్పులో మంత్రి నారాయణ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనిల్
December 1, 2016
రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి పొంగూరు నారాయణ తీరు పై నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తన మెడికల్ కాలేజీకి లబ్ధి చేకూర్చుకునేందుకే మంత్రి నారాయణ ప్రభుత్వ మెడికల్ కాలేజీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఒక మెడికల్ కాలేజీ అధినేతగా కాలేజిలో ఏయే సౌకర్యాలు అవసరమో నారాయణకు తెలియదా అని దుయ్యబట్టారు. తక్షణం ప్రభుత్వ కాలేజిలో వసతులు మెరుగుపరచి రద్దైన సీట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమీషనర్ మార్పు పై స్పందిస్తూ అతి తక్కువ సమయంలో నలుగురు కమీషనర్లను మార్చిన ఘనత నారాయణకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఏమీ చేయలేక తన స్వంత శాఖ అయిన మున్సిపల్ శాఖలో కమీషనర్లను మార్చుకుంటూ నారాయణ కూర్చున్నారని, ఇలా అయినా నారాయణ అనే ఒక మంత్రి ఉన్నారని ప్రజలు గుర్తిస్తారని ఆయన భావిస్తూ ఉండొచ్చేమో అని అన్నారు. ఏదేమైనా ఇటువంటి చర్యల ఫలితంగా నెల్లూరు పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని ఎమ్మెల్యే అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు.