రాష్ట్రాన్ని బీహార్ గా మార్చిన వైసీపీ మాఫియా : లోకేష్

ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేసింది వైసీపీ మాఫియా అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్లో శుక్రవారం ట్వీట్ చేశారు. తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంని ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాక్షస క్రీడకు అద్దం పడుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? అని అన్నారు.

సుబ్రహ్మణ్యంని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని,  కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యపై కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డగించారు. కాకినాడ జీజీహెచ్ కు మృతదేహం తరలించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

మృతదేహం తరలించకుండా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలని డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు సర్దిచెప్పి అంబులెన్స్ లో మృతదేహం తీసుకెళ్లారు. మార్గం మధ్యలో అంబులెన్స్ ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల ఆందోళనకు దిగారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *