రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోంది : యనమల
రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని, ఈ చతుష్టయ సభ్యులైన జగన్ రెడ్డి, సజ్జల, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా పాలిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జగన్ రెడ్డి రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊభిలోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడం ఖాయమన్నారు. జగన్ రెడ్డిది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుని పోయిందని, కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి రుణాలను నిరోధించకపోతే రాష్ట్రానికి కొలెటరెల్ ఆర్థిక నష్టం జరగడం ఖాయమని తెలిపారు. కేంద్రం వైసీపీ ప్రభుత్వం చేసిన మొండి బకాయిలను ఎంతకాలం రక్షిస్తుందని ప్రశ్నించారు.జగన్ రెడ్డి అవినీతి సొమ్ము కూడబెట్టుకుని రాబోయే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నాడని ఆరోపించారు. ‘‘అవినీతి, అక్రమాలు, లూటీతో సంపాదించిన సొమ్మును కేంద్రం బయటకు తీయాలి.
ఆదాయం లేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని రాష్ట్ర దయనీయ స్థితికి జగన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? వైసీపీ పతనం అంచున ఉంది. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. జగన్ రెడ్డి ప్రభుత్వానిది మోసకారి సంక్షేమం అని ప్రజలు తెలుసుకున్నారు. ఇచ్చిన మాట..చేసిన వాగ్దానం అన్నింటినీ తుంగలో తొక్కారు. అన్ని వర్గాలను మోసం చేశారు. సంక్షేమ పథకాల అమలు కంటే ప్రకటనలకు, ప్రచారాలకే ప్రాధాన్యతనిచ్చారు. జగన్ రెడ్డి హామీలతో మోసానికి గురైన ప్రజలే రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడం ఖాయం’’ అని విమర్శించారు.