వచ్చే ఎన్నికల్లో నగరి నుండే పోటీ: సినీనటి వాణీవిశ్వనాథ్
సినిమాల్లో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సినీనటి వాణీవిశ్వనాథ్ తెలుగునేలపై రాజకీయ అరంగ్రేటం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. అది కూడా రాయలసీమ ప్రాంతం నుండి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నేతను ఢీ కొంటానంటోంది. ఇంతకీ ఎవరిపై పోటీ చేస్తానంటోంది..ఎక్కడి నుండి పోటీ చేస్తానంటోంది. వివరాళ్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా నగరి రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. గతంలో ముద్దుకృష్ణమనాయుడు నుండి నేటి రోజా వరకు నగరిలో రాజకీయం రంజుగానే ఉంటుంది.
2014 ఎన్నికల్లో బరిలోకి దిగిన రోజా 2019లోనూ విజయం సాధించింది. వరుసగా రెండు సార్లు విజయం సాధించి రాష్ట్రరాజకీయాల్లో సంచలనం అయ్యారు. అయితే ఇటీవల వైసీపీలోని అసంతృప్తి వాదులు ఆమెపై గళం విప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించి తీరుతామని సవాల్ చేస్తున్నారు కూడా. ఇదిలా ఉండగా ఈ సారి నగరి నుండి పోటీ చేయడం ఖాయమని సినీనటి వాణీవిశ్వనాథ్ తేల్చి చెప్పారు. ఇటీవల నగరిలోని ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నగరిలో తనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని, వారి కాంక్ష మేరకు నగరి నుంచి పోటీ చేస్తానని తెలిపారు.
తాను ఏ పార్టీ నుండి పోటీ చేసేది మాత్రం చెప్పలేదు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని చెప్పారు. గతంలో టీడీపీలో చేరతారని వార్తలు వినిపించినా మళ్లీ వెనక్కి తగ్గారు. ఇటీవల బీజేపీలో చేరతారని కూడా ప్రచారం జరిగినా ఆమె స్పందించలేదు. ఈ మధ్య వాణీ చేసిన వ్యాఖ్యలతో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో అంతుబట్టడం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న తన వ్యాఖ్యలతో ఇక రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.