యుద్ధ సమయంలో కూల్ గా వివాహం చేసుకున్న ఉక్రెయిన్ జంట!
ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే దిశగా రష్యా చకచక అడుగులు వేస్తుంది. అక్కడ ఉన్న వేర్పాటువాద ప్రాంతాలను ఇప్పటికే ఆక్రమించుకుని వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఇలా ఒక్కొక్క దానిని ఆక్రమిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు దేశంలోని ప్రజలను కాపాడుకునేందుకు అధ్యక్షుడే రంగంలోకి దిగారు. సైన్యంలో కలిసి తాను మొదటి సైనికుడిని అని చెప్పకనే చెప్పాడు. మరోవైపు యుద్ధ విమానాలు ఉక్రెయిన్ లో కొన్ని కీలక ప్రాంతాల్లో బాంబులు వేస్తున్నాయి. చాలా ప్రాంతాలు ఇప్పటికే రక్త సిక్తం అయ్యాయి. ఇంత ఘోర యుద్ధం ఒక వైపు జరుగుతుంటే.. నగరం తగలబడి పోతుంటే ఎవరో ఫిడేలు వాయిచుకున్నట్లు… ఓ జంట ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుని ఓ చర్చిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.
ఓ వైపు బీకర యుద్ధం జరుగుతుంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పుర్రెకో బుద్ధి అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వింత ఆలోచనతో ఒక్కటైన వారు ఎవరంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉండే యారినా అరివా, స్వ్యటోస్లావ్ ఫర్సిన్. ఓ వైపు దేశం తగలబడి పోతుండే తాపీగా వివాహం చేసుకున్నందుకు వీరిని సోషల్ మీడియాలో కొంతమంది దుమ్మెత్తి పోస్తున్నారు.
పెళ్లి చేసుకున్న జంట వాదన కూడా చాలా ఆసక్తిగా ఉంది. మరు క్షణం తాము బతికి ఉంటామో లేదో తెలియదు. అందుకే ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నాము. మేము కూడా దేశం తరుపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాము. ఎలాగైన రష్యా దురాక్రమణను అడ్డుకుని తీరుతాం అని తెలిపారు. ఏదైమైనా కానీ తాటాకు చప్పుళ్లకు భయపడే ఈ రోజుల్లో బాంబుల మోతకు కూడా భయపడకుండా పెళ్లి చేసుకున్నారంటే వారి సంకల్పం అటువంటిది అని అర్థం అవుతుందని మరికొందరు అంటున్నారు.