ప్రమాణస్వీకారం చేసిన రొండురోజులకే కోర్టులో దొంగతనం : వర్ల రామయ్య
ఏపీలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని, ఓ వైపు క్రైమ్ రేటు పెరిగిపోతుంటే మరోవైపు సంఘ వ్యతిరేక శక్తులకు, నేరగాళ్లకు అధికార పార్టీ రక్షణ కల్పిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. నెల్లూరు కోర్టులో దొంగిలించబడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి పోర్జరీ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల దొంగతనంను న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా గుర్తించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం డీజీపీకి లేఖ రాశారు. ప్రభుత్వ వైఖరి ఫలితంగా సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా తయారయ్యిందని విమర్శించారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నకిలీ పత్రాలు సృష్టించిన వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 2017లో కేసు నమోదైందని, ఈ కేసు విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను, పత్రాలను నెల్లూరులోని 4వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు లాకర్ రూమ్‌లో భద్రపరిచి ఉంచారని గుర్తు చేశారు. 14 ఏప్రిల్ 2022, గురువారం, లాకర్ రూంను పగులగొట్టి, ఏ1 ముద్దాయి అయిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దొంగిలించబడినట్లు గుర్తించారని పేర్కొన్నారు.
ఈ దొంగతనం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఈ నేరపూరితమైన కుట్ర వెనుక ఉన్న పెద్ద మనుషులను కూడా బయటకు లాగాలని కోరారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా 11 ఏప్రిల్ 2022, సోమవారం ప్రమాణస్వీకారం చేశారని, ప్రమాణస్వీకారం చేసిన రెండు, మూడు రోజుల్లోనే కోర్టు లాకర్ రూం నుంచి సాక్ష్యాధారాలు దొంగిలించబడ్డాయని ఆరోపించారు. ఈ కుట్ర కేవలం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడటానికి కుట్రని అమలు చేసినట్టుగా అనిపిస్తుందని తెలిపారు.