మద్యంతో జగన్ కు అభిషేకం..
మద్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అభిషేకం నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అదికూడా ఎక్కడో కాదు..సాక్షాత్తూ అసెంబ్లీలో ప్రాంగణంలోనే జగన్ ఫోటోకు మద్యంతో అభిషేం చేశారు. జగన్మోహన్ రెడ్డి కల్తీ బ్రాండ్లు, తెచ్చారని, వీటితో జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరోపిస్తూ జె.బ్రాండ్స్ తో జగన్ కు అభిషేం చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. బీరు సీసాను చేతబట్టి మాజీ మంత్రి నారా లోకేష్ స్వయంగా జగన్ చిత్ర పటంపై పోశారు. అయితే గత వారం రోజులుగా జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి చనిపోయిన 27 మంది మరణాలపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మద్య తీవ్రస్థాయిలో వాదనలు జరుగుతున్నాయి.
నాటు సారా తాగడం వల్లే 27 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంటే అవన్నీ సాధారణ మరణాలేనని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశమే పది రోజులుగా అసెంబ్లీని కుదిపేస్తోంది. సారా మరణాలపై చర్చ జరగాలని ప్రతిపక్షం పట్టుబడటం, అధికార పార్టీ మండిపడటం, సభ వాయిదా పడటం, టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం వంటివే రోజూ జరగుతున్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. సోమవారం కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో ఈ సెషన్ వరకు స్సీకర్ మూకుమ్మడి సస్పెండ్ చేశారు.
దీంతో టీడీపీ సభ్యులు జంగారెడ్డిగూడెం బయలు దేరనున్నారు. ఇటీవల సారాతో మృతి చెందిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాలకు భరోసాగా ఒక్కో కుటుంబానికి పార్టీ తరపున లక్ష రూపాయలు పరిహారం ప్రకటించారు. ఈ పరిహారాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలకు అందించనున్నారు. అయితే అవి సారా మరణాలు కాదని ప్రభుత్వం కొట్టిపారేస్తున్నప్పటికీ మరోవైపు నాటు సారా బట్టీలపై ఎస్ఈబీ అధికారుల దాడుల కొనసాగుతున్నాయి.