టికెట్ ధరలు ఒకే.. మరి నిత్యవసర వస్తువుల పరిస్థితేంటి- గోరంట్ల
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు భలే రసవత్తరంగా మారిపోయాయి. ముఖ్యంగా సినిమా టికెట్ల వ్యవహారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరను తగ్గిస్తూ పాస్ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్, డిస్టిబ్యూటర్లు కోర్టుమెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా జీవోను రద్దు చేయమని చెప్పినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం, జగన్‌ను ఉద్దేశిస్తూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీని కాస్త పట్టించుకోవాలని కోరారు.
కాగా, హీరో నాని కూడా ఏపీ ప్రభుత్వం వైఖరిని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై వైకాపా మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందిస్తూ.. నానిపై మాటలతో విరుచుకుపడ్డారు.తాజాగా, బొత్సా వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. సినిమా అందరికీ అందుబాటులో ఉండాలని ధరలు తగ్గించారని బొత్సా అన్నారని.. మరి నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉండనక్కర్లేదా?.. అంటూ తిరిగి ప్రశ్నించారు. కాస్త వాటిపైనా దృష్టిపెట్టమని ప్రజలు గగ్గోలు పెడుతున్నారంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
శ్యామ్‌సింగరాయ్ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. థియేటర్ల కంటే పక్కనుండే కిరాణా షాపులో కలెక్షన్లు బాగుంటున్నాని టికెట్లురేట్లు తగ్గించి ప్రజలను అవమానిస్తున్నారని నాని అన్నారు. దీంతో తెలుగునాట హాట్‌టాపిక్‌గా మారింది.