రాప్తాడు ఎమ్మెల్యేకి పరిటాల సునీత స్ట్రాంగ్ వార్నింగ్

రాప్తాడు రాజకీయాలు మళ్లీ ఒక్కసారిగా వేడెక్కాయి. పరిటాల-తోపుదుర్తి కుటుంబాల మధ్య వార్ మొదలైంది. ఎప్పటి నుండో ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి, పరిటాల శ్రీరామ్ కు మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల పరిటాల రవి మరణం గురించి తోపుదుర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పరిటాల కుటుంబంపైనా నిప్పులు చెరిగారు. దీంతో పరిటాల శ్రీరామ్ కూడా తగ్గేదేలే అంటూ ప్రతి విమర్శలకు దిగారు.

ఇదిలా ఉండగా రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన గౌరవసభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‍రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు. శ్రీరాములయ్య సినిమా షూటింగ్‍లో కారు బాంబు పెట్టించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 26 మందిని పొట్టన పెట్టుకోవడంలో ప్రకాష్‍రెడ్డి కూడా భాగస్తుడు అని ఆరోపించారు. మా చరిత్ర కాదు.. ప్రకాష్‍రెడ్డి తన చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.  ప్రకాష్‍రెడ్డి అవినీతిపై సినిమా తీసేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

ప్రకాష్‍రెడ్డి ఇంట్లో ఐదుగురు ఎమ్మెల్యేలున్నారని, మా కుటుంబాన్ని విమర్శించడం కాదు.. ప్రాజెక్టులు పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు. మరొకసారి పరిటాల రవి గురించి మాట్లాడితే సహించేదు లేదని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. పరిటాల రవి పేరు ప్రస్తావించే స్థాయి ప్రకాష్ రెడ్డికి లేదని, ప్రకాష్ రెడ్డి కల్లిబొల్లి మాటలు మాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుండి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో శ్రీరామ్ పరాజయం పాలయ్యారు. అప్పటి నుండి రాప్తాడు రాజకీయాలు రాజుకుంటున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *