పోక్సోకు మించిన సెక్షన్లతో కఠిన చర్యలు : వాసిరెడ్డి పద్మ

వసతిగృహంలో ఉంటూ చదివే విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ భగ్గుమంది. ఈ విషయం వెలుగులోకి రాగానే కాకినాడ ఎస్పీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  మాట్లాడారు. వివరాల్లోకొస్తే.. కాకినాడలోని కొండయ్యపాలెం హెల్పింగ్ హ్యాండ్స్ వసతిగృహంలో 15ఏళ్ల విద్యార్ధిని ఉంటూ సమీప పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. కరోనా మందుల పేరిట విద్యార్ధినితో నిద్రమాత్రలు మింగించి ప్రిన్సిపాల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి వెలుగులోకి రాగానే, రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.

కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కాకినాడ ఎస్పీతో  ఘటనపై ఆరాతీశారు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ ఏరియాను మహిళా కమిషన్ తరఫున పర్యవేక్షించే కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ ని స్థానిక అధికారులను అప్రమత్తం చేసి.. బాధితురాలి వైద్యసహాయాన్ని పర్యవేక్షించాలని సూచించారు. ఈమేరకు వాసిరెడ్డి పద్మ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కొద్దిగంటల్లోనే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రిన్సిపాల్ విజయకుమార్ ను అరెస్టు చేశారు.

అతనిపై పోక్సోకు మించిన సెక్షన్లతో కఠినచర్యలు చేపట్టాలని వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. మహిళలు, విద్యార్థినిలపై జరిగే అత్యాచారాలను అరికట్టేందకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. వారం రోజుల్లో చార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేసి నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చూడాలన్నారు. మహిళలు, బాలికల వసతిగృహాల పర్యవేక్షణను ఏ ఒక్కరి చేతిలో ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. ఇద్దరు ముగ్గురు బృందంతో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాల్సిన ఆవశ్యకత ఉందని వాసిరెడ్డి పద్మ మీడియాతో స్పష్టం చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *